టెల్ అవీవ్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం (Israel Iran War) మరింత ముదురుతున్నది. క్షిపణులు, డ్రోన్లతో ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. దీంతో టెహ్రాన్ సైన్యానికి చెందిన అత్యున్నత అధికారులతోపాటు పదుల సంఖ్యలో అణు శాస్త్రవేత్తలు మృతిచెందారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురుశుద్ధి కేంద్రంపై టెల్ అవీవ్ సైన్యం దాడికి పాల్పడింది. ప్రతిగా ఇరాన్‌కు కూడా అదేరీతిలో ప్రతిస్పదిస్తున్నది. ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తున్నది. ఈ బాలిస్టిక్ క్షిపణుల దాడిని ఇజ్రాయెల్ గొప్పగా చెప్పుకునే ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేకపోయింది. శత్రుదుర్భేధ్య రక్షణ వ్యవస్థగా చెప్పుకునే దానిని ఇరాన్ క్షిపణులు చీల్చుకుంటూ వెళ్లి ఇజ్రాయెల్ భూభాగంలో పడుతున్నాయి. దీంతో ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, జెరూసలెంలో భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి.
తాగా ఇరాన్ క్షిపణి దాడులతో జెరూసలెంలో సరైన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అదేవిధంగా జెరూసలెం, టెల్ అవీవ్ మీదుగా క్షిపణులు దూసుకొచ్చాయని వెల్లడించింది. వాటిలో కొన్ని క్షిపణులను మధ్యలోనే తాము కూల్చివేశామని పేర్కొంది. సౌత్‌వెస్ట్ రీజియన్‌లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేశామని ప్రకటించింది. అయితే హైఫా పట్టణంలో భారీగా మంటలు ఎగసిపడటం కనిపించిందని అంతర్జాతీయ మీడియా ఆర్టీ ఇంర్నేషనల్ వెల్లడించింది. ఈ దాడుల్లో నలుగురు గాయపడ్డారని తెలిపింది.
❗️Firefighters struggle to contain INFERNO after Iranian missile strike in Haifa
Four people injured in barrage so far, Israeli authorities say https://t.co/WBuoFUFcj3 pic.twitter.com/zMtkzgfdRL
— RT (@RT_com) June 15, 2025
ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య మొదలైన దాడులు క్రమంగా ప్రపంచ యుద్ధం దిశగా పయణిస్తున్నాయి. రెండు దేశాలతో పాటు ఆయా పక్షాల వైపు ప్రపంచ దేశాలు తమ సైనిక శక్తిని మోహరిస్తుండటం గుబులురేపుతున్నది. ఇరాన్‌పై యుద్ధంతో తమతో కలవాలని అగ్రరాజ్యం అమెరికాకు ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసినట్టు ఇద్దరు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ‘ఆక్సియోస్’ తన వార్తా కథనంలో పేర్కొంది. ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రాన్ని లోతైన భూగర్భంలో నిర్మించారని, అయితే దానిని ధ్వంసం చేసే శక్తి సామర్థ్యాలు తమకు లేవని, అమెరికా కనుక తమతో యుద్ధంలో కలిస్తే వాటిని సులభంగా ధ్వంసం చేయవచ్చునని ఇజ్రాయెల్ కోరింది. కాగా, ఆ అణు కేంద్రానికి సమీపంలోనే అమెరికన్ తన బాంబర్లను మోహరించిందని ఆ మీడియా సంస్థ వెల్లడించింది. ఆ అణు కేంద్రంపై కనుక అమెరికా దాడికి దిగితే అగ్రరాజ్యం కూడా యుద్ధంలో నేరుగా పాల్గొన్నట్టే. అవసరమైతే తాము నేరుగా యుద్ధంలో అడుగుపెడతామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ హామీ ఇచ్చారని ఆ వార్తాసంస్థ తెలిపింది. కాగా, తమతో యుద్ధంలో పాల్గొనమని ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసిన మాట వాస్తవమేనని, దానిని తాము తిరస్కరించామని అమెరికా అధికారులు తెలిపారు.
మధ్యప్రాచ్యానికి బ్రిటన్ జెట్లు
రెండు దేశాల మధ్య తీవ్రమైన పోరు జరుగుతున్న క్రమంలో జెట్లు, ఇతర మిలిటరీ సామగ్రిని తాము పశ్చిమాసియాకి తరలిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్మార్టర్ తెలిపారు. అయితే తాము ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడాన్ని ఆయన తోసిపుచ్చుతూ తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే తాము వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో అత్యవసర సహాయం కోసమే తాము జెట్లు, ఇతర సామగ్రిని తరలించామని ఆయన పేర్కొన్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఫ్రాన్స్ అప్రమత్తం
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫ్రాన్స్ అప్రమత్తమైంది. తమ భూభాగంలో యూదులు, అమెరికన్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా ప్రార్థనాస్థలాలు, పాఠశాలలు, విద్యాసంస్థలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు మత సంబంధమైన సమావేశాలు జరిగే ప్రాంతాలపై నిఘా పెంచాలని ఫ్రాన్స్ మంత్రి బ్రూనో ఆదేశించారు.