టెహ్రాన్, ఏప్రిల్ 5: పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకూ ఉధృతమవుతున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గడం లేదు. ఇరాన్ దాడులతో ఆదివారం గల్ఫ్ దేశాలు దద్దరిల్లాయి. ఆయా దేశాల్లోని ఇంధన సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. కువైట్, యూఏఈ, బహ్రెయిన్‌లపై డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పైనా భీకర దాడులు చేపట్టింది. మరోవైపు ఇరాక్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాలే లక్ష్యంగా ఇరాన్ మద్దతు గ్రూపులు దాడులు చేపట్టాయి.
కువైట్‌లోని ప్రధాన విద్యుత్తు, డీశాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ డ్రోన్ దాడులకు దిగింది. ఈ విషయాన్ని ఆ దేశ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ దాడులతో ఆ ప్లాంట్లకు భారీగా నష్టం ఏర్పడిందని, దీంతో రెండు విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లను మూసివేశామని, అయితే ఇందులో ఎవరూ మరణించడం కానీ, గాయపడటం కానీ జరగలేదని తెలిపారు. కువైట్‌లోని ప్రభుత్వ కాంప్లెక్స్‌పై కూడా ఆదివారం డ్రోన్ దాడి జరిగింది. ఈ కాంప్లెక్స్ చమురు మంత్రిత్వ శాఖ, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. దాడుల నేపథ్యంలో సిబ్బందిని ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించాలని ఆదేశించామని అధికారులు తెలిపారు.
తమ దేశంలోకి దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను చాలావరకు నిరోధించినట్టు కువైట్ మిలిటరీ ప్రకటించింది. అధికారులు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను పౌరులు తప్పనిసరిగా పాటించాలని కోరింది. డ్రోన్ దాడిలో తమ షువైక్ చమురు క్షేత్రం మంటల్లో చిక్కుకుందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. మంటలను అత్యవసర బృందాలు అదుపు చేస్తున్నాయని, జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు కువైట్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. శక్రవారం మినియా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై దాడి తర్వాత ఇరాన్ తన దాడులను కొనసాగిస్తూనే ఉందని పేర్కొన్నది.
బహ్రెయిన్‌లోని అతిపెద్ద రిఫైనరీ అయిన బాప్కో ఎనర్జీస్ నిర్వహిస్తున్న సదుపాయంలోని ఒక స్టోరేజ్ ట్యాంక్‌పై ఆదివారం ఇరాన్ క్షిపణితో దాడి జరిపింది. దాడిలో ఆ ప్రదేశంలో భారీగా ఎగసిపడుతున్న మంటలు, నల్లటి పొగతో నిండిన వీడియోను ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది. 10 సెకన్ల ఈ క్లిప్‌లో తొలుత అక్కడ భారీ పేలుడు సంభవించి ఆ ప్రదేశం అగ్నిగోళంగా మారిపోయింది. ఆ తర్వాత భారీగా ఎగసిపడ్డ మంటలు, నల్లటి పొగ కన్పించాయి. కాగా, దాడి ప్రమాదాన్ని పసిగట్టి సైరన్లు మోగించి పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు బహ్రెయిన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో కూడా ఇరాన్ ఈ ప్రదేశంపై దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో తమపై 13 డ్రోన్లతో దాడి జరిగినట్టు బహ్రెయిన్ వెల్లడించింది.
రియాద్‌లోని యూఎస్ ఎంబసీపై ఇరాన్ గత నెలలో చేసిన డ్రోన్ దాడిలో గతంలో పేర్కొన్న దానికన్నా భారీగానే నష్టం జరిగిందని అమెరికా మాజీ అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూస్జే) తెలిపింది. ఈ దాడి లో ఇరాన్ రాయబారి క్వార్టర్స్‌తో పాటు కార్యాలయం కూడా పూర్తిగా ధ్వంసం అయింది. మూడంతస్తుల భవనం తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు, ఇరాక్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై ఇరాన్ మద్దతు గ్రూపులు దాడులు చేసినట్టు అమెరికా ఎంబసీ తెలిపింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, ఆస్ట్రియాకు చెందిన బోరియాలిస్ సంయుక్త సంస్థ అయిన బోరూజ్ పెట్రో కెమికల్స్ ప్లాంట్‌లో శకలాలు పడి మంటలు చెలరేగాయి. తమ గగనతల రక్షణ వ్యవస్థలు దాడులను విజయవంతంగా అడ్డుకున్న తర్వాత కింద పడిన శకలాలతో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. అయితే రువైస్‌లో ఉన్న ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది.
ఇజ్రాయెల్‌లోని డ్రోన్ తయారీ సంస్థపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఈ దాడితో పెటా టిక్వాలోని ఈ తయారీ యూనిట్ పూర్తిగా ధ్వంసమై కార్యకలాపాలు నిలిపివేశారు. దీంతో ఇజ్రాయెల్ రక్షణ ఉత్పత్తుల తయారీకి అంతరాయం ఏర్పడినట్టు భావిస్తున్నారు.

ఇరాన్ దాడితో కువైట్ పవర్, డీశాలినేషన్ ప్లాంట్లలో చెలరేగిన మంటలు

ఇరాన్ దాడితో ఇజ్రాయెల్‌లోని డ్రోన్ తయారీ సంస్థలో జరిగిన విధ్వంసం

ఇజ్రాయెల్ దాడితో ఇరాన్‌లోని మహ్షహ్ పెట్రో కెమికల్ జోన్ నుంచి వెలువడుతున్న పొగ