టెహ్రాన్, జూలై 13: తన తండ్రి, మాజీ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ హెచ్చరించిన కొన్ని రోజుల్లోనే తమ లక్ష్యాలుగా ‘ప్రతీకార జాబితా’లో చేర్చిన 13 మంది ప్రపంచ నాయకుల జాబితాను ఇరాన్ విడుదల చేసింది. ప్రతీకార జాబితాను ఇరాన్ జాతీయ దినపత్రిక హమ్‌షహ్రీ శనివారం ప్రచురించింది. అందులోని ఒక గ్రాఫిక్ లేఅవుట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నుదుటిపై స్నైపర్ తరహా క్రాస్‌హెయిర్ లక్ష్యాలను అతికించినట్లు చిత్రీకరించారు.
దాని కింద ప్రతీకార జాబితాలో బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మన్ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అమెరికా యుద్ధ మంత్రి పీట్ హెగ్సెత్, అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ బ్రాడ్ కూపర్, ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారి మెక్ హకబీ, ఇజ్రాయెల్ రక్షణ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయల్ జమీర్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ పేర్లు ఉన్నాయి.
ఈ బాబితాను ఇరాన్ అధికారికంగా ధృవీకరించనప్పటికీ ప్రతీకారం అనివార్యమని మొజ్తబా ప్రకటించిన తర్వాత ఈ జాబితా వెలువడడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ ప్రతీకారం మన దేశ సంకల్పం. ఇది తప్పక అమలు కావాలి అని శుక్రవారం సంతకం చేసిన లిఖితపూర్వక సందేశంలో మొజ్తబా పేర్కొన్నారు. ఈ ప్రతీకారం నా వ్యక్తిగత ఉనికిపైన గానీ ఇతర అధికారుల ఉనికిపైన గానీ ఆధారపడి లేదు. మనం ఉన్నా లేకపోయినా ఇది జరిగి తీరుతుంది అని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో అలీ ఖమేనీ మరణించారు. గత వారం ఖమేనీ అంత్యక్రియలు జరిగాయి. అయితే ఖమేనీ ముగ్గురు సోదరులు ముస్తఫా, మేసం, మసూద్ ఆరు రోజులపాటు జరిగిన తమ తండ్రి అంత్యక్రియలకు హాజరైనప్పటికీ 56 ఏండ్ల సుప్రీం నాయకుడు మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. భద్రతా కారణాల వల్లనే ఆయన తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదని తెలుస్తోంది. సుప్రీం నాయకుడిగా ప్రకటించిన తర్వాత ఒక్కసారి కూడా ఆయన కనిపించలేదు.
టెహ్రాన్, జూలై 13: అమెరికాతో తాము కుదుర్చుకున్న ఇస్లామాబాద్ ఒప్పందం తీవ్ర సంక్షోభ స్థితిలో ఉందని ఇరాన్ సోమవారం ప్రకటించింది. 14 అంశాల ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. కాగా హొర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు సోమవారం కొత్త విడత సైనిక దాడులకు దారితీసిన తరుణంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. తమ మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమెరికా విచ్ఛిన్నం చేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ఆరోపించారు. ఇరాన్ తను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందే తప్ప మాట తప్పలేదని ఆయన స్పష్టం చేశారు. హొర్ముజ్ జలసంధికి సంబంధించి తన హామీలను నెరవేర్చడానికి ఇరాన్‌కు 60 రోజుల వ్యవధిని అందించే ఒప్పందంలోని 5వ పారాను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నిబంధనను అసలు అమల్లోకి రాకుండా అమెరికా అడ్డుపడిందని ఆయన ఆరోపించారు.