టెహ్రాన్/కైరో: పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. యుద్ధం ఆదివారం 16వ రోజుకు చేరుకుంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. యూఏఈ నుంచి అమెరికా తమపై దాడులు చేసిందని ఆరోపించిన ఇరాన్.. యూఏఈపై ప్రతిదాడులు ముమ్మరం చేసింది. యూఏఈలోని మూడు ప్రధాన పోర్టులను ఖాళీచేయాలని ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. ఆదివారం వేకువజామున దుబాయ్‌లోని మెరీనా, అల్ సుఫోహ్ ఏరియాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను తమ దేశ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుందని, అందుకు సంబంధించిన శబ్దాలే ఇవని దుబాయ్ మీడియా ఆఫీస్ వెల్లడించింది. కువైట్ ఎయిర్‌పోర్టుపైనా ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపించింది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. యూఏఈపై ఇరాన్ ఇప్పటివరకు 1800 మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. ఇందులో 1600 డ్రోన్లు, 294 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. ఈ దాడుల్లో ఆరుగురు మరణించగా, 140 మందికిపైగా గాయపడ్డారు.
యూఏఈ లోని ఫుజైరా పోర్టుపై శనివారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో భారత్‌కు చెందిన ఒక చమురు నౌక త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. జాగ్ లాడ్కీ పేరు గల ఈ నౌక దాడి జరిగిన సమయంలో పోర్టులోని క్రూడ్ ఆయిల్ టెర్మినల్ వద్ద చమురును ఎగుమతి చేసుకుంటున్నది. అయితే ఈ దాడిలో నౌకకు, సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదు. దీంతో ఈ నౌక ఆదివారం ఉదయం 10.30 గంటకు ప్రయాణమయ్యింది.
ఇరాన్ రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు అమెరికాపై తీవ్ర ఆరోపణ చేశారు. బాలల లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ నెట్‌వర్క్‌లో మిగిలిన సభ్యులు అమెరికాలో సెప్టెంబర్ 11 తరహా దాడులు చేయడానికి, దానికి ఇరాన్‌ను బాధ్యునిగా చేసేందుకు కుట్ర పన్నారని ఇరాన్ సుప్రీం నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ ఆరోపించారు.
హొర్ముజ్ జలసంధిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక ప్రకటన చేశారు. జలసంధి చాలా వరకు నౌకలకు తెరిచే ఉందని, అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్రదేశాలకే మూసివేసినట్టు వెల్లడించారు. ఇతర దేశాల నౌకలు ఈ కీలక మార్గం గుండా వెళ్లేందుకు అనుమతిస్తున్నట్టు చెప్పారు. నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తమ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డాడని అమెరికా చేస్తున్న ప్రకటనలపై ఆయన స్పందిస్తూ.. ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టంచేశారు.
ఇజ్రాయెల్‌తో పాటు యూఎస్ సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు జరుపుతున్న ఇరాన్ సెజ్జిల్ క్షిపణి అలియాస్ డ్యాన్సింగ్ క్షిపణితో పాటు అధునాతన క్షిపణుల శ్రేణిని ఆదివారం ప్రయోగించింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ప్రయోగించిన సెజ్జిల్ క్షిపణి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. దాదాపు రెండువేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి 700 కిలోల పేలోడ్‌ను మోసుకుపోగలదు. దీని యుక్తి సామర్థ్యం కారణంగా దీనికి డ్యాన్సింగ్ క్షిపణి అనే మారు పేరు వచ్చింది.
ఇరాన్ జరిపిన దాడుల్లో తాను మరణించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొట్టివేశారు. చేతిలో కాఫీ గ్లాస్‌తో కన్పించిన ఒక వీడియో మెసేజ్‌లో ఆయన కాఫీ తాగుతూ, తన మరణంపై జరుగుతున్న ప్రచారాన్ని ఎగతాళి చేశారు. నెతన్యాహు ఇటీవల జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి మరణించారని, ఆయన ఇటీవల టెలివిజన్‌లో కల్పించినది ఫేక్ అని, అది ఏఐ ద్వారా సృష్టించినదంటూ సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
దీనిపై నేరుగా స్పందించిన నెతన్యాహు ఒక వీడియో విడుదల చేస్తూ తాను బతికే ఉన్నానని, తన విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్నానని తెలిపారు. నెతన్యాహు చనిపోయారంటున్నారు.. మరి నేను ఎవరిని? అని ఆయన సరదాగా ప్రశ్నించారు. నేను కాఫీ తాగడానికి చనిపోయాను అని హాస్యంగా అన్నారు. ఈ వీడియోలో ఆయన కాఫీకి ఆర్డర్ ఇవ్వడం, తన మరణంపై వస్తున్న వదంతులపై జోక్ చేయడం కన్పించింది. మరణించే వరకు దేశాన్ని ప్రేమిస్తుంటానని పేర్కొన్న ఆయన, ఈ సంక్షోభ సమయంలో ప్రజల సహకారాన్ని మరువలేనని ప్రశంసించారు.
నెతన్యాహు మరణ వార్తలపై ఇరాన్ కూడా స్పందించింది. ఆయన బతికే ఉంటే.. వేటాడి చంపుతామని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై 16వ రోజు కూడా దాడులను కొనసాగించింది ‘పిల్లల ఉసురు తీసిన హంతకుడు నెతన్యాహు బతికే ఉంటే అతడిని వేటాడి చంపుతాం’ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఓ ప్రకటనలో హెచ్చరించింది.