Iran | పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ (Israel) వైమానిక దళం ఇరాన్‌పై (Iran) ముందస్తు దాడులకు దిగింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. శుక్రవారం ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్ధం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. దీనికి ప్రతిగా టెహ్రాన్ సైతం ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగింది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఆ దాడులను ఇజ్రాయెల్ దళాలు (Israeli military) సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.
కొన్ని గంటల్లోనే ఇరాన్ వందకుపైగా డ్రోన్లను ప్రయోగించినట్లు (Iran launched over 100 drones) ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ చీఫ్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ మాట్లాడుతూ.. ‘గత కొన్ని గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ 100కిపైగా డ్రోన్లను ప్రయోగించింది. వాటిని మా దళాలు కూల్చివేశాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు మా సైన్యం పనిచేస్తోంది’ అని తెలిపారు.
ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ భగేరి మృతి
ఇవాళ ఉదయం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్‌వైపు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి హుస్సేన్ సలామీ మృతిచెందినట్లు ఇరానియన్ స్టేట్ టెలివిజన్ తెలిపింది. అంతేకాదు ఇరాన్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ భగేరి కూడా మృతి చెందారు. ఇరాన్ సైనిక దళాల్లో అత్యున్నత ర్యాంక్ కలిగిన ఆఫీసర్ భగేరి. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ జరిపిన దాడిలో మృతిచెందిన వ్యక్తుల్లో భగేరి రెండో కీలక వ్యక్తిగా నిలిచారు.
ఆపరేషన్ రైజింగ్ లయన్‌లో భాగంగా నిర్వహించిన దాడుల్లో.. నటాంజ్‌లో ఉన్న అణు శుద్దీకరణ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. అణు శాస్త్రవేత్తలను కూడా దాడుల్లో టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ చేపడుతున్న బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్‌కు.. నటాంజ్ కేంద్రం ప్రధానంగా నిలుస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల్లో అమెరికా సహాయం కానీ, పాత్ర కానీ లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబో తెలిపారు. మరో వైపు అదివారం ఒమన్ దేశం వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య అణ్వాయుధ కేంద్రాలపై చర్చలు జరగనున్నాయి.
ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్
ఇరాన్‌పై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధీకరణ కార్యక్రమం, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఇరాన్ ముప్పును తిప్పికొట్టడమే టార్గెట్‌గా సైనిక చర్య చేపట్టామని చెప్పుకొచ్చారు. ఇరాన్ ముప్పు తొలగించడానికి ఎన్ని రోజులైనా ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.
గగనతలాన్ని మూసివేసిన ఇరాన్..
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని (Iran Airspace) మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ, ముంబై నుంచి లండన్, న్యూయార్క్‌కు వెళ్లే అనేక విమానాలు ప్రభావితమయ్యాయి. పలు విమానాలను దారిమళ్లించగా.. మరికొన్ని వెనక్కి తిరిగివస్తున్నాయి. దాదాపు 16 ఎయిర్ ఇండియా విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
Also Read..
Marco Rubio | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. మాకు సంబంధం లేదన్న అమెరికా
Israel | అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి