Iran warning : చమురు రవాణా (Oil transport) కు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ (Moztaba Khamenei) సైనిక సలాహాదారుడు మోహ్సేన్ రెజాయి (Mohsen Rezaei) అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తే.. తమ తొలి క్షిపణి దాడికే అమెరికా (USA) నౌకలు మునిగిపోతాయని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్మూజ్‌కు రక్షక భటుడిగా మారాలనుకుంటున్నారని, ఇది నిజంగా మీరు చేయాల్సిన పనేనా..? అమెరికా వంటి శక్తిమంతమైన సైన్యం చేయాల్సిన పనేనా..? అని రెజాయ్ ప్రశ్నించారు. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం చూపాలని చూస్తే తమ తొలి క్షిపణి దాడికే అమెరికా నౌకలు మునిగిపోతాయని హెచ్చరించారు. తమ క్షిపణులు కచ్చితమైన దాడులు చేసి అమెరికా నౌకలను ధ్వంసం చేయగలవని పేర్కొన్నారు.
మా దాడుల్లో జలసంధి ప్రాంతంలో ఉన్న అమెరికా బలగాల ప్రాణాలు కూడా పోవచ్చని రెజాయ్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై భూతల దాడులకు అమెరికా సిద్ధమైందంటూ ఇటీవల పెద్దఎత్తున వచ్చిన వార్తలపై కూడా ఆయన మాట్లాడారు. భూతల దాడులకు వచ్చిన యూఎస్ సైనికులను బందీలుగా చేసుకుంటామని హెచ్చరించారు. వారిని విడిపించుకోవాలంటే.. ఒక్కో బందీకి ఒక బిలియన్ డాలర్ ఇవ్వాల్సి వస్తుందన్నారు. అమెరికా- ఇరాన్ మధ్య ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.