టెహ్రాన్, మే 12: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఇరాన్ అణు హెచ్చరిక జారీ చేసింది. తమ దేశ ఉనికికి ప్రమాదం వాటిల్లితే తమ అణు విధానాన్ని మార్చుకుంటామని పేర్కొన్నది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సలహాదారు కమల్ ఖర్రజి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటి వరకు అణు బాంబు తయారు చేయాలని మేము నిర్ణయించలేదు. ఇరాన్ ఉనికికి ప్రమాదం వాటిల్లితే మేము మా అణు విధానాన్ని మార్చుకోవడం తప్ప మాకు మరో మార్గం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌లో సిరియా రాజధాని లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి జరగడం, తర్వాత ఇజ్రాయెల్ పైకి ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లు ప్రయోగించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.