టెల్ అవివ్ : ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఘర్షణలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. అయితే ఇరాన్ తన ప్రతిదాడిలో భాగంగా ఇప్పటి వరకు 370 బాలిస్టిక్ క్షిపణుల(Ballistic Missiles)ను ప్రయోగించింది. దీంతో పాటు వందలాది సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయిల్ మీదకు వదినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ద్రువీకరించింది. సోమవారం ఉదయం వరకు ఇజ్రాయిల్‌లో 24 మంది మరణించారు. మరో 592 మంది గాయపడ్డారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నది. ఇరాన్ ప్రయోగించిన ప్రొజెక్టైల్స్.. ఇజ్రాయిల్‌లోని 30 ప్రాంతాలను ధ్వంసం చేశాయి. అయితే శుక్రవారం నుంచి జరుగుతున్న దాడుల్లో.. ఇజ్రాయిల్ అటాక్ వల్ల ఇరాన్లో 224 మంది మరణించారు.
ఇరాన్‌కు చెందిన మిలిటరీ చీఫ్‌లను ఇజ్రాయిల్ టార్గెట్ చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ సుప్రీం నేత అయాతొల్లా అలీ ఖమేనీ హత్యకు కూడా ఇజ్రాయిల్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. కానీ ఆ ప్లాన్‌ను విరమించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్‌పై వత్తిడి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఖమేనీని హతమార్చే ప్లాన్ తమకు లేదని కూడా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యహూ తెలిపారు.
టెహ్రాన్‌కు మిస్సైల్ లాంచర్లు తీసుకెళ్తున్న ట్రక్కులపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ దళం పేర్కొన్నది. దీనికి సంబంధించిన ఫూటేజ్‌ను రిలీజ్ చేసింది. ఆయుధాలను తీసుకెళ్తున్న అనేక ట్రక్కులను గుర్తించి .. ఇజ్రాయిల్ వైమానిక దళం వాటిపై అటాక్ చేసింది. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ లాంచర్లతో పాటు ఇతర ఆయుధాలు ఆ ట్రక్కుల్లో ఉన్నాయి.