Iran Attack : అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొన్ని రోజులు పొడిగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన కొన్ని గంటలకే హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో కీలక పరిణామం చోటుచేసుకొంది. జలసంధిలో ఉన్న రెండు నౌకలపై ఇరాన్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో ఓ కంటైనర్ నౌక దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ హర్మూజ్ జలసంధిలో ఓ కంటైనర్ నౌకపై కాల్పులకు పాల్పడిందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ పేర్కొన్నది. కాల్పులకు ముందు గన్‌బోట్ నౌకకు ఎలాంటి హెచ్చరికలు చేయలేదని తెలిపింది. కాల్పుల్లో నౌకకు నష్టం వాటిల్లిందని, ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టంచేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే.. ఒక రవాణా నౌకపై కూడా ఇరాన్ కాల్పులు జరిపిందని పేర్కొన్నది. ఈ ఘటనలో సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, నౌకకు కూడా ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది.
కాగా కంటైనర్ నౌకపై దాడిని ఇరాన్ మీడియా కూడా ధ్రువీకరించింది. ఐఆర్జీసీ పదేపదే హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ముందుకు కదలడంతోనే నౌకపై బలగాలు కాల్పలు జరిపినట్లు వెల్లడించింది. కాగా, టెహ్రాన్‌కు చెందిన వాణిజ్య నౌకను అమెరికా దళాలు ఇటీవల స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇరాన్.. నౌకలపై దాడులు చేయడం ఉద్రిక్తతలను మరోసారి తీవ్రం చేసింది.