జెరుసలాం: ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు అటాక్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే 40 రోజుల తర్వాత సీజ్ఫైర్ కుదిరింది. ఇరాన్‌పై దాడికి చెందిన రిపోర్టును ఇజ్రాయెల్(Israel) రిలీజ్ చేసింది. ఈ ఫైటింగ్ సమయంలో సుమారు 650 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ఫైర్ చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొన్నది. దీంట్లో సగం కన్నా ఎక్కువ క్లస్టర్ బాంబులు ఉన్నట్లు ఇజ్రాయిల్ మిలిటరీ చెప్పింది. బాంబు వార్‌హెడ్స్‌ను ఆ క్షిపణులు మోసుకెళ్లాయి. ఇరాన్ జరిపిన దాడుల్లో సుమారు 20 మంది ఇజ్రాయిలీ పౌరులు మరణించారు. దీంట్లో విదేశీ జాతీయులు కూడా ఉన్నారు. వెస్ట్ బ్యాంక్‌కు చెందిన నలుగురు పాలస్తీనియన్లు ఉన్నట్లు తెలిసింది. ఇక ఇరాన్ దాడి వల్ల సుమారు ఏడు వేల మంది ఇజ్రాయిలీలు గాయపడినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇరాన్ మొదటి రోజు 80 మిస్సైళ్లు ఫైర్ చేసింది. ఆ తర్వాత రెండో రోజు 60, మూడో రోజు 30 క్షిపణులను వదిలింది. ఇక ఆ తర్వాత వారాల్లో సీజ్ఫైర్ కుదిరే వరకు ప్రతి రోజు ఇరాన్ సగటును 10 నుంచి 20 క్షిపణులను రిలీజ్ చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొన్నది. సుమారు 16 క్షిపణులు వార్‌హెడ్స్‌తో ఇజ్రాయెల్‌పై అటాక్ చేశాయని, వాటిల్లో వందల కిలోల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు మిలిటరీ పేర్కొన్నది. ఇజ్రాయిల్‌లోని జనసాంద్రత ఉన్న ప్రదేశాలపై ఆ బాంబులతో దాడి చేశారు. క్లస్టర్ బాంబు వార్‌హెడ్స్‌తో ఉన్న సుమారు 50 క్షిపణులను ఇరాన్ ఫైర్ చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. ఇరాన్ దాడిలో చనిపోయిన 24 మంది పౌరులే అని తెలిపింది.
హోమ్ ఫ్రంట్ కమాండ్ ప్రకారం.. బాంబు దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో సుమారు 5500 మంది చెల్లాచెదురయ్యారు. ఇక ఇరాన్‌పై సుమారు వెయ్యికిపైగా జరిగిన వైమానిక దాడుల్లో 18000 బాంబులను ఇజ్రాయెల్ జార విడిచింది. ఐడీఎఫ్ ప్రకారం.. 4 వేల టార్గెట్లపై 10800 దాడులు జరిగినట్లు తెలిసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లు, వెపన్ ప్రొడక్షన్ సైట్లు, న్యూక్లియర్ కేంద్రాలు, వివిధ ప్రధాన కార్యాలయాలు, మిలిటరీ కమాండర్లు, నేతలను టార్గెట్ చేస్తూ ఆ దాడులు జరిగాయన్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన వైమానిక దళం ఇరాన్‌పై సుమారు 8500 సోర్టీలు నిర్వహించినట్లు మిలిటరీ పేర్కొన్నది. ఇక ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా సుమారు 13000 దాడులు చేసినట్లు అమెరికా మిలిటరీ పేర్కొన్నది.
ఇరాన్ ప్రయోగించిన 470 క్షిపణుల్లో 60 శాతం క్షిపణులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయల్ మిలిటరీ తెలిపింది. 200 లాంచర్లను ధ్వంసం చేసింది. టన్నెల్స్‌లో దాడి వల్ల 80 ప్రదేశాలు దెబ్బతిన్నట్లు ఐడీఎఫ్ చెప్పింది. వార్‌కు ముందు ఇరాన్ వద్ద సుమారు 2500 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు ఐడీఎఫ్ అంచనా వేసింది. అయితే ఇరాన్ వద్ద ఇంకా సుమారు వెయ్యి క్షిపణులు ఉన్నట్లు ఐడీఎఫ్ ఇంటెలిజెన్స్ అంచనా వేస్తున్నది. ఇరాన్‌కు చెందిన 85 శాతం ఎయిర్ డిఫెన్స్, డిటెక్షన్ సిస్టమ్స్‌ను నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పింది.