Iran : ఇజ్రాయెల్ (Israel) గూఢచార సంస్థ మొసాద్ (Mossad) కోసం పనిచేసిన ఇద్దరు వ్యక్తులను ఇరాన్ శనివారం ఉరితీసింది. యాకూబ్ కరీంపూర్ (Yakub Karimpur), నాసర్ బెకర్జాదే (Nasar Bekarjade) అనే ఈ ఇద్దరికీ సుప్రీంకోర్టు (Supreme Court) మరణశిక్ష ఖరారు చేయడంతో.. న్యాయ ప్రక్రియల అనంతరం శిక్షను అమలు చేసినట్టు ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్‌తో 40 రోజులపాటు జరిగిన యుద్ధ సమయంలో కరీంపూర్ మొసాద్‌కు చురుకుగా సహకరించినట్టు అధికారులు తెలిపారు.
దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని టెలిగ్రామ్ ద్వారా మొసాద్ అధికారికి చేరవేసినట్లు వెల్లడించారు. సైనిక స్థావరాల వద్ద పేలుళ్లు జరపడం, వాటిని చిత్రీకరించడం, భద్రతా సంస్థలను తప్పుదోవ పట్టించడం వంటి పనులకుగాను ఇతను డబ్బులు స్వీకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక మరో దోషి అయిన బెకర్జాదే.. ఇరాన్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఉన్నతాధికారులు, మత పెద్దలకు సంబంధించిన సమాచారం, ఫోటోలు, వీడియోలను వాట్సాప్, ఈమెయిల్ ద్వారా మొసాద్‌కు అందించినట్టు అధికారులు తెలిపారు. దీనికి ప్రతిఫలంగా ఇతను కూడా డబ్బులు తీసుకున్నట్టు నిర్ధారించారు.
కాగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించగా.. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాగా కాంగ్రెస్ అనుమతి లేకుండా ప్రారంభించిన సైనిక చర్యకు 60 రోజుల గడువు ముగియడంతో ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇదేరోజు ఈ ఉరిశిక్షలు అమలు కావడం గమనార్హం.