Iran : ఇరాన్ (Iran) లో నాగరికతను ఈ రాత్రికే అంతం చేస్తామని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో టెహ్రాన్ (Tehran) భారీగా సైనిక సమీకరణ చేపడుతోంది. ఈ క్రమంలోనే దేశం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను సరిహద్దులకు పంపాలంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ టెలివిజన్‌లో బహిరంగ ప్రకటన చేసింది. యుద్ధభూమిలో నిలబడినప్పుడే వారు యోధులుగా ఎదుగుతారని తన ప్రకటనలో పేర్కొన్నది.
రాత్రి సమయాల్లో దేశంలోని చెక్పాయింట్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల వద్ద కాపలాకాయడానికి వారిని మోహరించనున్నట్లు తెలుస్తున్నది. కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు ముగింపునకు కొన్ని గంటల ముందు ఐఆర్జీసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు ఐఆర్జీసీ అనుబంధ సంస్థ పిల్లలను సైన్యంలోకి చేర్చుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆసక్తి ఉన్న యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే పలువురు మైనర్లను ఇరాన్ యుద్ధ రంగంలోకి దించుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. గత నెలలో టెహ్రాన్‌లోని ఒక చెక్‌పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా 11 ఏళ్ల బాలుడు మరణించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి.