Houthi Attacks : గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాపై హౌతీ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. సౌదీలోని కీలక స్థావరాలపై సోమవారం దాడి చేశామని హౌతీలు ప్రకటించారు. ఈ అంశంపై హౌతీ మిలిటరీ ప్రతినిధి యహ్యా సరీ మంగళవారం వివరాలు వెల్లడించాడు. సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో ఉన్న కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై, రబిగ్లో ఉన్న అరాంకో రిఫైనరీపై దాడి చేసినట్లు చెప్పారు. డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైల్స్, క్రూయిజ్ మిస్సైల్స్‌తో దాడి చేసినట్లు వెల్లడించాడు.
అలాగే, దక్షిణ సౌదీ అరేబియాలోని కొన్ని చిన్న ఎయిర్‌పోర్టులపై కూడా దాడి చేసినట్లు తెలిపారు. హౌతీలు.. యెమెన్‌లోని ప్రత్యేక మిలిటెంట్ గ్రూప్. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తుంటారు. యెమెన్ సైన్యానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం. దీనికి నిధులు, ఆయుధాల్ని ఇరాన్ సమకూరుస్తుంటుంది. ఇరాన్ మద్దతుతో హౌతీలు సౌదీ అరేబియాపై దాడి చేస్తున్నారు. రియాద్ సహా అనేక ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే, ఎక్కడ దాడి జరిగింది.. ఆస్తి నష్టం, ప్రాణం నష్టం, గాయపడిన వారి వివరాల్ని సౌదీ ప్రభుత్వం వెల్లడించలేదు.
ఒకపక్క హౌతీలు సౌదీపై దాడి చేస్తుంటే.. సౌదీ కూడా యెమెన్‌లోని హౌతీల స్ధావరాలపై దాడులు చేస్తోంది. సౌదీ కూటమి దళాలకు చెందిన యుద్ధ నౌకలు హౌతీలపై దాడులు చేసినట్లు ఈ కూటమి ప్రతినిధి తుర్కి అల్ మల్కి తెలిపారు. యెమెన్, ఎర్ర సముద్ర తీరంలోని హోదెదా పట్టణంపై దాడి చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతం హౌతీల ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. యెమెన్ ప్రభుత్వానికి సౌదీ ప్రభుత్వం అండగా ఉంటే.. హౌతీ ఉగ్రవాదులకు మాత్రం ఇరాన్ అండగా ఉంటోంది.
హౌతీల ఆధ్వర్యంలో ఉన్న సనా పట్టణంపైకి వెయ్యికిపైగా దాడులు చేశామని యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సౌదీ అరేబియాకు మద్దతు ఇచ్చేందుకు పాకిస్తాన్, టర్కీ అంగీకరించాయి. సౌదీకి తమ దేశాల నుంచి కొంతమంది సైన్యాన్ని పంపుతున్నట్లు తెలిపాయి.