Iran Attack : అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా (West Asia) లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే.. అమెరికా-ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ ప్రతిదాడులు చేసింది. క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టింది.
హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇది జరిగిన కాసేపటికే బందర్ అబ్బాస్ పోర్టు వద్ద కూడా పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ దాడులను ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్’ దురాక్రమణ చర్యగా అభివర్ణించింది. అమెరికా పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఇరాన్ ఆరోపించింది. ఇలాంటి దురాక్రమణలు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అమెరికా తాజా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్‌లను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ తెలిపింది. కానీ అది ఎక్కడి స్థావరం అనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే తమ గగనతలంపైకి క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చాయని కువైట్ దళాలు పేర్కొన్నాయి. వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించాయి.