లండన్ : ఫోన్(Mobile Phones) దొంగతనాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్ గుట్టును బ్రిటన్ పోలీసులు విప్పారు. బ్రిటన్ నుంచి దొంగలించిన సుమారు 40 వేల ఫోన్లను చైనాకు స్మగ్లింగ్ చేసినట్లు ఆ గ్యాంగ్‌పై ఆరోపణలు ఉన్నాయి. దొంగతనానికి గురైన ఓ ఐఫోన్ కేసును చేధిస్తున్న పోలీసులకు ఆ గ్యాంగ్ విషయాలు బయటపడ్డాయి. గత ఏడాది ఓ అంతర్జాతీయ ఫోన్ దొంగల ముఠా సుమారు 40 వేల మొబైల్ ఫోన్లను స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. చోరీకి గురైన సుమారు రెండు వేల ఫోన్లను రికవరీ చేశారు. లండన్‌లో ఫోన్ చోరీ ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అంతర్జాతీయ టూరిస్టులతో కిటకిటలాడే లండన్‌లో ఫోన్ చోరీ కేసులు అధికం అవుతున్నాయి. ఫోన్ దొంగల ముఠాను పట్టుకునే క్రమంలో లండన్‌లోని సుమారు 28 ప్రాపర్టీల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఓ ఐఫోన్ చోరీ కేసులో దర్యాప్తు చేపడుతున్న సమయంలో ఆ ఫోన్ లింకు హీత్రూ ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. అక్కడ తనిఖీ చేసిన అధికారులకు ఆ ఫోన్ ఓ బాక్సులో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ బాక్సులో సుమారు 900 ఫోన్లు ఉన్నాయని, అవన్నీ కూడా చోరీకి గురైనవే అని పోలీసులు నిర్ధారించారు. ఆ కేసుతో కూపీలాగిన పోలీసులకు అంతర్జాతీయ ఫోన్ దొంగతనాల ముఠా గుట్టు వీడింది. గత నాలుగేళ్ల నుంచి బ్రిటన్‌లో ఫోన్ దొంగతనాల సంఖ్య భారీగా పెరిగింది. 2020లో 28 వేల ఫోన్లు చోరీగా కాగా, ఆ సంఖ్య 2024లో 80 వేలు దాటింది.