AI | సిడ్నీ: కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం మానవుడి ఆలోచనా శక్తిపై ఎలా పడుతున్నదనే అంశంపై తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వారానికి దాదాపు 30 కోట్ల మంది చాట్‌జీపీటీని వాడుతున్నట్లు అంచనా. చాలా వరకు మనం మెదడుతోనే ఆలోచించగలం. అయితే, చిన్న చిన్న లెక్కలు చేయడానికి, దుకాణాల్లో సరుకులు కొనడానికి పరికరాలపై ఆధారపడుతుండటం వల్ల మనం మన జీవితాలను సౌకర్యవంతంగా మార్చుకుంటున్నామా? లేక మనం వివేకహీనులుగా మారుతున్నామా? అనే ప్రశ్నకు అమెరికాలోని మైక్రోసాఫ్ట్, కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ‘అవును’ అనే సమాధానం ఇవ్వవచ్చు అంటున్నారు! ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన సమయంలో ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనదని పరిశోధకులు చెప్తున్నారు.
చదివిన, విన్న, చెప్పిన, రాసిన విషయాన్ని గురించి ప్రశ్నించుకుని, విశ్లేషించుకుని, అర్థం చేసుకుని, మదింపు చేసుకుని, సరైన నిర్ణయం తీసుకోవడాన్ని క్రిటికల్ థింకింగ్(విశ్లేషణాత్మక ఆలోచన) అంటారు. యూజర్లు తమ క్రిటికల్ థింకింగ్‌పై జనరేటివ్ ఏఐ ప్రభావం గురించి ఎలా భావిస్తున్నారనే అంశాన్ని పరిశోధకులు తమ అధ్యయనంలో మదింపు చేశారు. ప్రస్తుత పద్ధతులు, నియమాలను బట్టి మనం సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. వాదనలలో పొంతన కుదరడం, కచ్చితత్వం, గట్టి సంబంధం కలిగి ఉండటం వంటి విలువలు ఈ నియమాల్లో కొన్ని. మనకు ప్రస్తుతమున్న ప్రాపంచిక దృక్పథాలు, పక్షపాతాలు, అసంపూర్ణ లేదా కచ్చితత్వం లేని మానసిక విధానాలపై ఆధారపడటం వంటివి మన ఆలోచనల నాణ్యతపై ప్రభావం చూపే మరికొన్ని అంశాలని అధ్యయనంలో తేలింది. తాజా అధ్యయనంలో 319 మంది నాలెడ్జ్ వర్కర్స్ పాల్గొన్నారు.
వీరు తాము జనరేటివ్ ఏఐ సహాయంతో నిర్వహించిన 936 టాస్క్‌ల గురించి చర్చించారు. వెరిఫికేషన్, ఎడిటింగ్ దశల్లో శ్రద్ధ పెట్టడంలో కన్నా, టాస్క్ నిర్వహణలో క్రిటికల్ థింకింగ్‌ను తక్కువగా ఉపయోగిస్తున్నట్లు యూజర్లు భావించారని తేలింది. ఏఐపై ఎక్కువ నమ్మకం గలవారు క్రిటికల్ థింకింగ్‌ను తక్కువగా ప్రదర్శించారని, తమపై తమకు ఎక్కువ నమ్మకం గలవారు క్రిటికల్ థింకింగ్‌ను ఎక్కువగా ప్రదర్శించారని వెల్లడైంది. అందువల్ల జనరేటివ్ ఏఐ వ్యక్తి యొక్క క్రిటికల్ థింకింగ్‌కు చేటు చేయదని తెలుస్తున్నది. యూజర్ల క్రిటికల్ థింకింగ్‌ను ప్రోత్సహించేందుకు ఫీచర్లను పెట్టాలని జనరేటివ్ ఏఐ డెవలపర్లకు ఈ అధ్యయనకర్తలు సలహా ఇస్తున్నారు. అయితే, ఏఐని ఉపయోగించడానికి ముందు, ఉపయోగించేటపుడు ప్రతి దశలోనూ విశ్లేషణాత్మక ఆలోచన అవసరమేనని పరిశోధకులు సూచిస్తున్నారు.