న్యూఢిల్లీ : మనుషులతో కలిసి పనిచేసే రోబోలు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ, మానవులకు హాని జరగకుండా జాగ్రత్త వహించగలవని కొలరాడో విశ్వవిద్యాలయం పరిశోధకులు చెప్పారు. సమీపంలో మానవులు ఉన్నపుడు సురక్షితంగా, తెలివిగా ఎలా నిర్ణయాలు తీసుకోవాలో రోబోలకు నేర్పడానికి కొత్త ఆల్గారిథమ్ను ప్రతిపాదించారు. ఫ్యాక్టరీలో రోబోలు, మానవులు కలిసి పని చేసేటపుడు; రోబోలు అసెంబ్లింగ్ వంటి పనులను పునరావృతం చేస్తాయి.
సహోద్యోగుల చర్యలను అర్థం చేసుకుని మానవులు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో, అదే విధంగా రోబోలు కూడా తమ సమీపంలోని మానవుల చర్యలను అర్థం చేసుకుని, ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగేలా ఈ కొత్త ఆల్గోరిథమ్‌ను తయారు చేశారు. ప్రొఫెసర్ లహిజనియన్, గ్రాడ్యుయేట్ విద్యార్థుల బృందం దీనిని తయారు చేసింది. వ్యూహాత్మక నిర్ణయీకరణను విశ్లేషించే గేమ్ థియరీ నుంచి ప్రేరణ పొంది, వీరు దీనిని తయారు చేశారు.
ఈ కొత్త ఆల్గోరిథమ్‌లను ఉపయోగించుకుని, రోబోలు వివేకంతో ప్రతిస్పందిస్తాయని తెలిపారు. చదరంగం క్రీడాకారుడి మాదిరిగా, వ్యక్తికి ఓ అడుగు ముందు ఉండేలా ఈ సిస్టమ్‌ను డిజైన్ చేశారు. దీని అసలు లక్ష్యం మనుషులకు హాని జరగకుండా చూసుకోవడం. అంతిమ లక్ష్యం ఏమిటంటే, రోబోలు తప్పనిసరిగా మానవులతో సర్దుబాటు చేసుకోవాలి.