ఇప్పుడు చాలామంది ఇంటర్నెట్లో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని చూస్తున్నారు. దీంతో వింత వింత పనులు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనతోనే ఓ ఇండోనేషియన్ ఆడ మేకను పెళ్లిచేసుకున్నాడు. ఈ వివాహ వేడుకను షూట్ చేసి, యూట్యూబ్లో పెట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తూర్పు జావాలోని గ్రెసిక్కు చెందిన సైఫుల్ ఆరిఫ్ అనే 44 ఏళ్ల వ్యక్తి యూట్యూబర్. ఇంటర్నెట్ను ఆకర్షించాలనే ఉద్దేశంతో జూన్ 5న గ్రేసిక్లోని బెంజెంగ్ జిల్లాలోని క్లాంపోక్ గ్రామంలో రహయు బిన్ బెజో అనే పేరుగల ఆడ మేకను వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకను వీడియో తీశాడు.
ఈ వీడియోలో ఆరిఫ్ జావానీస్ దుస్తులు ధరించి కనిపించగా, మేక శాలువాతో అలంకరించారు. స్థానికులు సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ వేడుకకు హాజరయ్యారు. అతడు మేకకు రూ. 22,000 కట్నం కూడా ఇచ్చాడు. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో సైఫుల్ అందరికీ క్షమాపణ చెప్పాడు. ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమేనని, ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యంతో చేయలేదని పేర్కొన్నాడు.