London | లండన్: ఒకప్పటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు రాజధాని లండన్‌లో భారతీయులు పాగా వేశారు. లండన్‌లో అత్యధిక భాగం మనోళ్ల చేతుల్లోనే ఉన్నది. అవును, ఇది నిజమే. ఇప్పుడు లండన్‌లో ఎక్కువ ఆస్తిపాస్తులు కలిగి ఉన్నది భారతీయులే. ఇతర దేశాలవారినే కాదు, స్థానికులైన బ్రిటిషర్లను మించి మనవాళ్లు అక్కడ ఆస్తులను కలిగి ఉన్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రీత్యా బ్రిటన్‌కు వెళ్లిన భారతీయులు లండన్‌లో ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నట్టు ‘బ్యారెట్ లండన్’ విడుదల చేసిన ‘ది రైజ్ ఆఫ్ ప్రాపర్టీ పవర్ ఇన్ లండన్’ నివేదిక వెల్లడించింది. ఇది తాత్కాలిక ధోరణి మాత్రమే కాదని, లండన్ ప్రాపర్టీ మార్కెట్లో కనిపిస్తున్న గణనీయమైన మార్పు అని ఆ నివేదిక స్పష్టం చేసింది.
‘బ్రిక్స్ ఇన్ఫా’ అనే యూజర్ ఈ విషయాన్ని ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా వెంటనే వైరల్‌గా మారింది. లక్షల మంది దీన్ని వీక్షించారు. బ్రిటిష్ వలస పాలనలో మన దేశం ఎక్కువ కాలం ఉండటంతో భారతీయులు దీనిపై తమదైన శైలిలో కామెంట్లు చేశారు. బండ్లు ఓడలు అవడం, ఓడలు బండ్లు అవడం అంటే ఇదేనని కొందరు చమత్కరించారు. ‘ఒకప్పుడు సగం ప్రపంచం వారి చేతుల్లో ఉండేది.
కానీ, ఇప్పుడు లండన్‌లో సగం కంటే తక్కువ మాత్రమే వారి వద్ద ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘భారత ఉపఖండాన్ని ఆక్రమించిన బ్రిటిషర్ల వలె కాకుండా భారతీయులు చట్టపరంగా చేశారు’ అని ఒకరు పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ‘ఇంగ్లండ్‌ను వలస రాజ్యం చేయాలి, దానికి న్యూ ఇండియా అనే పేరు పెట్టాలి’ అని కొందరు కామెంట్ చేశారు.