కెప్టెన్ హర్ప్రీత్ చాందీ అరుదైన ఘనత.. తొలి భారత సంతతి మహిళగా రికార్డు
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఆర్మీ కెప్టెన్ హర్ప్రీత్ చాందీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఒంటరిగా అంటార్కిటికా యాత్రను పూర్తిచేసిన తొలి భారత సంతతి మహిళగా చరిత్రకెక్కారు. 40 రోజులపాటు 700 మైళ్ల దూరం ట్రెక్కింగ్ చేసి దక్షిణ ధృవాన్ని చేరుకోవడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు. ‘40 రోజుల సుదీర్ఘ యాత్ర పూర్తిచేసుకొని ఇప్పుడే దక్షిణ ధృవానికి చేరుకొన్నా. ప్రస్తుతం ఇక్కడ మంచు కురుస్తున్నది. అనేక రకాల అనుభూతులను ఆస్వాదిస్తున్నా. ధృవ ప్రాంతమంటే ఏమిటో, అదెలా ఉంటుందో మూడేండ్ల క్రితం వరకు నాకేమీ తెలియదు. ఎంతో కష్టపడి చివరికి ఇక్కడికి చేరుకోవడం చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తున్నది. నా సాహస యాత్రకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని కెప్టెన్ హర్ప్రీత్ చాంద్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పేర్కొన్నారు.