న్యూయార్క్: అమెరికాలో విద్యాభ్యాసం, ఆ పై ఉపాధి పొంది డాలర్లు సంపాదించాలన్న ఆశతో ఆ దేశానికి వెళ్తున్న మన విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం విధించిన వీసా నిబంధనలతో కడుపు మాడ్చుకుంటూ రోజులు నెట్టుకొస్తున్నారు. వీసా నిబంధనల కారణంగా ఓవైపు ఉపాధి అవకాశాలు తగ్గిపోయి మరోవైపు జీవన వ్యయం పెరిగిపోవడంతో సర్దుబాటు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వీసా నిబంధనలు ఉల్లంఘించారన్న నెపంతో ఇటీవలి కాలంలో 4,700 మంది భారతీయ విద్యార్థుల వీసాలను అమెరికన్ ప్రభుత్వం రద్దు చేసిందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది. విద్యాలయాల్లో హాజరు శాతం తక్కువ కావడం, అనధికారికంగా ఉపాధి పొందడం వంటి కారణాలతో వీరి వీసాలు రద్దయినట్టు వెల్లడించించింది. ఇటీవల పలు రాష్ర్టాల్లో భారతీయ విద్యార్థులు పనిచేస్తున్న ప్రదేశాల్లో తనిఖీలు భారీగా పెరిగాయి. దీంతో తమ వద్ద పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న విద్యార్థులను యజమానులు తొలగిస్తున్నారు. దీంతో తాము జీవన వ్యయాన్ని తగ్గించుకోవలసి వస్తున్నదని లేదా తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వస్తున్నదని విద్యార్థులు వాపోతున్నారు.
‘ఇంతకుముందు నేను ఓ రెస్టారెంట్లో రోజూ ఎనిమిది గంటలు పనిచేసి 1200 డాలర్లు సంపాదించేవాడిని. ఇటీవల తనిఖీలు అధికం కావడంతో మా యజమాని పని నుంచి తీసేశాడు. దీంతో నేను మరో రెస్టారెంట్ వెతుక్కున్నాను, కానీ అక్కడ నాకు రోజూ మూడు గంటలే పనిచేసేందుకు అనుమతిస్తున్నారు. దీంతో 400 డాలర్ల కన్నా తక్కువ వస్తున్నది. అవి నాకు సరుకులు కొనడానికి కూడా సరిపోవడం లేదు’ అని లాస్ఏంజిల్స్లో ఓ సైబర్ సెక్యూరిటీ విద్యార్థి తెలిపాడు. ఈ ఆర్థిక సమస్యల కారణంగా చాలామంది విద్యార్థులు ఖర్చులు తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్లో ఆరుగురు విద్యార్థులం ఉంటున్నామని అట్లాంటాలో ఓ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి చెప్పాడు.
అమెరికాలో ఉద్యోగ అనుభవం సంపాదించేందుకు ఉపయోగపడే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ)లో సైతం కొద్దిమందికే అవకాశాలు లభిస్తున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి ఓపీటీలో భారతీయ విద్యార్థుల సంఖ్య 28శాతం తగ్గిపోయింది. ‘అమెరికాకు రావడం నా భవిష్యత్తుకు పెట్టుబడిగా భావించి ఇక్కడకు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తరువాత చదువుపై దృష్టిని కేంద్రీకరించడానికి బదులు అద్దెలు, నిబంధనలపైనే నా ధ్యాస అంతా ఉంటున్నది. ఇప్పటికైనా పరిస్థితులు మెరుగుపడకపోతే ఇండియాకు వెళ్లిపోవడం తప్ప మరో మార్గం లేదు’ అని అట్లాంటాలో పని దొరకక ఇబ్బంది పడుతున్న ఓ ఐటీ గ్రాడ్యుయేట్ ఆవేదన వ్యక్తం చేశాడు. అమెరికా వెళ్లాలనుకొనే విద్యార్థులు అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకోవాలని భారత్‌లోని కన్సల్టింగ్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి.
అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో అంతర్జాతీయ విద్యార్థి విధానాలు కఠినతరం కావడంతో భారతీయులు విదేశాల్లో చదువుకుంటున్న తమ పిల్లలకు పంపించే సొమ్ము తగ్గిపోయింది. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ క్రింద విద్య కోసం మన దేశం నుంచి విదేశాలకు వెళ్లిన సొమ్ము రూ.10,229 కోట్లు అని భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ఇది నిరుటి కన్నా 22 శాతం తక్కువ.