న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : ఇటీవల అమెరికాలో వీసాల రద్దు లేదా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవీస్) రికార్డుల నుంచి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్(ఏఐఎల్ఏ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి విద్యార్థులు, న్యాయవాదులు, యూనివర్సిటీ ఉద్యోగుల నుంచి 327 కేసు నివేదికలను ఈ సంఘం సేకరించింది. ఈ అంతర్జాతీయ విద్యార్థులలో సగం మంది భారతదేశానికి చెందిన వారు కాగా 14 శాతం మంది చైనా విద్యార్థులని ఏఐఎల్ఏ తెలిపింది. మిగిలిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన వారని గురువారం వెల్లడించింది.
2023-24లో అమెరికాలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులలో అత్యధికులు భారతీయులేనని, మొత్తం 11,26,690 మంది అంతర్జాతీయ విద్యార్థులలో 3,31, 602 మంది (29 శాతం) భారతీయులేనని ఓపెన్ డోర్స్ డాటా పేర్కొంది. వీరి తర్వాత 2.77 లక్షల మందితో చైనా రెండవ స్థానంలో ఉంది. వీరిలో 50 శాతం మంది విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ)లో ఉన్నారని, అంటే వీరంతా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని ఏఐఎల్ఏ తెలిపింది. ఎఫ్-1 వీసాపై అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు 12 నెలలు పనిచేయవచ్చు. అదే స్టెమ్ కోర్సుల విద్యార్థులైతే మరో 24 నెలలు తమ వీసాను పొడిగించుకోవచ్చు. సెవీస్ రికార్డు నుంచి తొలగింపునకు గురైన ఓపీటీ విద్యార్థులు వెంటనే ఉద్యోగాలు చేసేందుకు వీల్లేదని, ప్రస్తుతం చదివే విద్యార్థులతో పోలిస్తే ఓపీటీ కింద ఉద్యోగాలు చేస్తున్న వారు తమ పాత హోదా పొందడం దుర్లభమని ఏఐఎల్ఏ తెలిపింది. 2023-24లో 3.32 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండగా వీరిలో 97,566 మంది విద్యార్థులు ఓపీటీలో ఉన్నారని ఏఐఎల్ఏ పేర్కొంది.
అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు ఏకపక్షంగా జరుగుతున్నట్లు ఏఐఎల్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. తాము సేకరించిన కేసుల నివేదికలలో 86 శాతం కేసులు ఏదో ఒక స్థాయిలో పోలీసులతో సంప్రదింపులకు నోచుకున్నాయని, 33 శాతం వీసాలు రద్దయిన కేసులలో అభియోగాలు నమోదు చేయకపోవడం, వారిపై కేసులు కట్టకపోవడం జరిగినట్టు ప్రకటన తెలిపింది.
గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన జోన్లో 70 కిలోమీటర్ల వేగంతోడ్రైవ్ చేయడం, చట్టవిరుద్ధంగా వాహనం పార్కింగ్ చేయడం, సీటు బెల్టు ధరించకపోవడం, నెంబర్ ప్లేట్లు గడువు తీరిపోవడం వంటి చిన్న చిన్న అభియోగాలతో పోలీసుల నుంచి ఓపీటీ విద్యార్థులకు నోటీసులు అందాయి. వీసా రద్దుకు గురైన విద్యార్థులలో ఇద్దరు విద్యార్థులకు మాత్రమే రాజకీయ నిరసనలలో పాల్గొన్న చరిత్ర లేదని ఏఐఎల్ఏ తెలిపింది. వీసా రద్దుకు సంబంధించిన ఈమెయిర్ నోటీసులు అందుకున్న మెజారిటీ విద్యార్థులకు ఈ నోటీసు వీసాను మంజూరు చేసిన కాన్సులేట్ నుంచి వచ్చినట్లు ఏఐఎల్ఏ పేర్కొంది. కాగా, అమెరికాలో వీసాలు రద్దయిన భారతీయ విద్యార్థుల గురించి విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ను గురువారం విలేకరులు ప్రశ్నించగా చాలామంది భారతీయ విద్యార్థులకు నోటీసులు అందిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం వేగంగా సమీపిస్తున్న వేళ అమెరికా స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల స్లాట్లు హఠాత్తుగా అదృశ్యం కావడం పట్ల భారత విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే అనధికారిక యాక్సెస్‌ను నివారించే ఉద్దేశంతో సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తుండడం వల్లే సాంకేతిక లోపం తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు.
అమెరికాలో విద్యనభ్యసిస్తున్న 1,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను ప్రభుత్వం రద్దు చేసింది. వారిలో చాలామంది భారతీయులు ఉన్నారు. ఏ క్షణంలోనైనా తమను దేశం నుంచి బహిష్కరిస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతున్నది. అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం మార్చి నుంచి హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతోపాటు దేశంలోని 160 కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన 1,024 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేశారు.