వాషింగ్టన్: కొలంబియా యూనివర్సిటీలోని భారత డాక్టొరల్ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ వీసాను ఉపసంహరించుకున్నట్టు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ(డీహెచ్ఎస్) వెల్లడించింది. దీంతో ఆమె సీబీపీ హోమ్ యాప్ సాయంతో స్వీయ బహిష్కరణ చేసుకుందని తెలిపింది.
రంజని హమాస్ సంస్థకు మద్దతు తెలిపే కార్యకలాపాల్లో పాల్గొన్నందున ఆమె వీసాను ఈ నెల 5న ఉపసంహరించామని, దీంతో ఆమె స్వీయ బహిష్కరణకు గురైనట్టు చెప్పింది. ఎఫ్-1 స్టూడెంట్ వీసా ద్వారా ఆమె అమెరికాలో చదువుకుంటుందని తెలిపింది. ‘మా దేశానికి చదువుకొనేందుకు వచ్చిన వారికి వీసా సౌకర్యం కల్పిస్తాం. అయితే మీరు ఉగ్రవాదాన్ని, హింసను సమర్థించినప్పుడు, ఆ ప్రత్యేక హక్కును రద్దు చేస్తాం. అలాంటి వారు ఈ దేశంలో ఉండకూడదు’ అని డీహెచ్ఎస్ సెక్రటరీ తెలిపారు.