వాషింగ్టన్, అక్టోబర్ 6: అమెరికాలో తుపాకీ కాల్పుల ఘటనలో మరొక భారత సంతతి పౌరుడు బలయ్యాడు. గత శుక్రవారం పిట్స్‌బర్గ్‌లో నిందితుడు స్టాన్లీ వెస్ట్ అత్యంత సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో హోటల్ యజమాని రాకేశ్ ఎహగాబన్ (51) అక్కడికక్కడే కుప్పకూలాడు. అత్యంత కిరాతకంగా హత్యచేయటమేగా, ‘ఆర్ యూ ఆల్రైట్’ అంటూ రాకేశ్‌ను ప్రశ్నిస్తూ నిందితుడు నిర్లక్ష్యంగా వెళ్లిపోవటం హోటల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. స్థానిక మీడియా కథనం ప్రకారం, పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ప్రముఖ పట్టణం పిట్స్‌బర్గ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గత రెండు వారాలుగా రాకేశ్ హోటల్లోనే బస చేస్తున్న నిందితుడు స్టాన్లీ వెస్ట్, హోటల్ బయట ఓ మహిళతో వాగ్వాదం చేస్తూ ఆమె మెడపై తుపాకీతో కాల్చాడు. ఇది గమనించి వారున్న చోటకు వెళ్లిన రాకేశ్‌పైనా స్టాన్లీ తుపాకీతో దాడికి తెగబడ్డాడు. అనంతరం అక్కడ్నుంచి పారిపోతున్న నిందితుడ్ని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. దీనికంటే ముందు డిటెక్టివ్ పోలీసులపైనా అతడు కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు.