లండన్, నవంబర్ 13: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సోమవారం తన క్యాబినెట్లో పలు కీలక మార్పులు చేపట్టారు. భారత మూలాలున్న హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ను మంత్రివర్గం నుంచి తొలగించి, ఆమె స్థానంలో జేమ్స్ క్లెవర్లీని నియమించారు. మరోవైపు మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ను అనూహ్యంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయనకు విదేశాంగ శాఖను అప్పగించారు. ఇటీవల డౌనింగ్ స్ట్రీట్ అనుమతి లేకుండా సుయెల్లా ది టైమ్స్ పత్రికలో రాసిన ఓ కథనం వివాదాస్పదం అయింది.
లండన్లో ఇజ్రాయెల్-గాజా ఆందోళనలను నియంత్రించడంలో నగర పోలీసులు విఫలమయ్యారని, ఇష్టమైన వారిని ప్రోత్సహించారని అందులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని స్వపక్షంతో పాటు విపక్షాల నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. మంత్రి పదవి తొలగింపుపై సుయెల్లా స్పందిస్తూ ‘హోంమంత్రిగా పనిచేయడం నా జీవితకాల అదృష్టం. నేను తగిన సమయంలో మరిన్ని చెప్తాను’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, కామెరాన్ గతంలో ఈయూలోనే యూకే కొనసాగాలని ప్రచారం చేశారు. బ్రెగ్జిట్ రెఫరెండంలో ఓడిపోవడంతో ఆయన 2016లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.