ఒట్టావా : సిక్కు తీవ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా ఉన్నత స్థాయి అధికారుల ప్రకటనలతో దర్యాప్తు తప్పుదోవపట్టిందని కెనడాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ ఆరోపించారు. ఆరోపణలకు కెనడా సాక్ష్యాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. గ్లోబల్ అండ్ మెయిల్ వార్తాపత్రికకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దర్యాప్తులో వారికి సహకరించడానికి నిర్దిష్టమైన సమాచారం భారత్‌కు అందించలేదని తెలిపారు. ‘సాక్ష్యం ఎక్కుడుంది?దర్యాప్తు ఇప్పటికే కళంకితమైందని నేను చెప్పగలను’ అని వర్మ అన్నారు. ‘హత్య వెనుక ఇండియన్ ఏజెంట్లు ఉన్నారని చెప్పమని ఉన్నతస్థాయిలో ఒకరి నుంచి ఆదేశాలు వచ్చాయి’ అని ఎవరి పేరూ ప్రస్తావించకుండా శనివారం ఆయన వెల్లడించారు.