వాషింగ్టన్, జనవరి 11 : ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక పరిస్థితి నిలకడగా పెరగనున్నప్పటికీ భారతదేశ ఆర్థిక స్థితి మాత్రం స్వల్పంగా బలహీనపడే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా అభిప్రాయపడ్డారు. ప్రధానంగా అమెరికా వాణిజ్య విధానం ఆధారంగా ప్రపంచంలో ఈ ఏడాది అనిశ్చితి ఏర్పడే అవకాశం చాలా ఉన్నట్టు ఆమె చెప్పారు. శుక్రవారం జరిగిన వార్షిక మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2025లో ప్రపంచ పురోగతి నిలకడగా ఉండవచ్చని, అయితే ప్రాంతీయంగా మార్పులు ఉండే అవకాశం ఉందని తెలిపారు. 2025లో భారతదేశ ఆర్థిక పరిస్థితి కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. అయితే దీనిపై ఆమె వివరణ ఇవ్వలేదు. గతంలో తాము ఊహించినదాని కన్నా అమెరికా మెరుగ్గా ఉందని, యూరోపియన్ యూనియన్ స్తంభించిపోయిందని, భారత్ కొద్దిగా బలహీనంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తక్కువ ఆదాయం గల దేశాలకు కొత్త సవాలు ఎదురైతే దాని ప్రభావం ప్రతికూలంగా ఉండగలదని అభిప్రాయపడ్డారు.