న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్య కుట్ర కేసులో అరెస్టయి చెక్‌రిపబ్లిక్ జైల్లో ఉన్న భారతీయుడు నిఖిల్ గుప్తాను (Nikhil Gupta) అమెరికాకు అప్పగించినట్లు తెలుస్తున్నది. సోమవారం ఆయన్ను న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టి విచారించనున్నట్లు సమాచారం. గతేడాది జూన్ 30న చెక్‌రిపబ్లిక్‌లోని ప్రేగ్లో నిఖిల్ గుప్తాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన బ్రూక్లిన్‌లోని ఫెడరల్ మెట్రోపాలిటన్ నిర్భంద కేంద్రంలో ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది.
నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించటంతో ఆయన్ను బ్రూక్లిన్ నిర్భంద కేంద్రంలో ఖైదీగా ఉంచినట్లు వెల్లడించింది. అయితే కోర్టు విచారణ కోసం ఆయన్ను అమెరికా తీసుకువచ్చినట్లు తెలుస్తున్నది. కాగా, అమెరికా గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని యూఎస్ వెల్లడించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూని హత్య చేసేందుకు ఓ వ్యక్తికి 15వేల అమెరికా డాలర్లు సుపారీగా ఇచ్చినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. అయితే ఖలిస్థానీ హత్య కుట్ర వెనక భారతీయుల ప్రమేయం ఉందన్న అమెరికా ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అజిత్ దోభల్లో ఆయన భేటీ కానున్నారు. ఈ తరుణంలో గుప్తాను చెక్‌రిపబ్లిక్ నుంచి అమెరికాకు తరలించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.