Khawaja Asif : దాయాది పాకిస్థాన్ (Pakistan) మరోసారి భారత్ (India) పై పిచ్చి ప్రేలాపనలు చేసింది. ఘర్షణలతో తమను ఎప్పుడూ బిజీగా ఉంచాలనే వ్యూహాలను భారత్ అనుసరిస్తోందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ రక్షణ మంత్రి (Pakistan defence minister) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) ఆరోపించారు. అఫ్గానిస్థాన్ (Afghanistan) తో పాకిస్థాన్ ఘర్షణల నేపథ్యంలో భారత్‌పై ఆసిఫ్ ఈ నింద మోపారు.
అదేవిధంగా అఫ్గాన్‌తో తాజా ఘర్షణలు ఆపేందుకు ఖతార్, టర్కీ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉన్నాయని ఖవాజా అన్నారు. అయితే తూర్పు, పశ్చిమ సరిహద్దుల ఘర్షణల్లో తాము నిమగ్నమయ్యేలా భారత్ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. అఫ్గాన్ ఘర్షణలు, ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావిస్తూ ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాలం నుంచి భారత్ తమపై పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు.
దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అవసరమైతే వాటిని బయటపెడతామన్నారు. ఇంతకుముందు కూడా భారత్ తరఫున అఫ్గాన్ పరోక్ష యుద్ధం చేస్తోందంటూ ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో అఫ్గాన్ వాసులు అక్రమంగా ఉండటాన్ని పాక్ అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తిందని ఆసిఫ్ పేర్కొన్నారు. అఫ్గాన్ నుంచి ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగితే దానికి ఆ దేశమే జవాబుదారీగా ఉంచే నిబంధనలు చర్చల్లో ఉన్నాయన్నారు.
తమవైపు నుంచి ఎలాంటి శత్రు కార్యకలాపాలు జరగడం లేదన్నారు. అఫ్గానిస్థానే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇటీవల పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ కొనసాగింపునకు రెండు దేశాలు ఇటీవల అంగీకరించాయి. సయోధ్య కుదిర్చేందుకు టర్కీ, ఖతార్‌లు ప్రయత్నిస్తున్నాయి.