Modi-Trump : భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కాల్ చేయకపోవడం వల్లే రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ ఆగిందని అమెరికా వాణిజ్య విభాగ కార్యదర్శి హోవర్డ్ లుత్నిక్ అన్నారు. తాజాగా ఆయన ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) ఎప్పుడో కుదరాల్సి ఉంది. అయితే, అది చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తోంది.
దీనికి కారణం ప్రధాని మోదీనే అని అమెరికా అధికారి లుత్నిక్ తెలిపారు. ‘‘ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఆరు దశల చర్చలు జరిగాయి. అలాగే ఇండియాపై 50 శాతం టారిఫ్ లు తగ్గించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నాం. తుది ఒప్పందం కుదిరే సమయంలో ట్రంప్ కు మోదీ ఫోన్ చేయకపోవడం వల్ల డీల్ కుదరలేదని లుత్నిక్ తెలిపారు. ట్రంప్ కు ఫోన్ చేయాలని మోదీకి సూచించినట్లు కూడా ఆయన తెలిపారు. అయితే, ఈ విషయంలో ఎందుకో ఇండియా (మోదీ) అసంతృప్తితో ఉన్నట్లు, అందుకే కాల్ చేసి ఉండకపోవచ్చని ఆయన అన్నారు. ఇదే సమయంలో వియత్నాం, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాలతో కూడా ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నట్లు, వీటన్నింటికి ముందే ఇండియాతో డీల్ ముగుస్తుందని భావించినట్లు చెప్పారు.
ఇప్పుడు అసలు సమస్య ఇప్పుడు అమెరికా-ఇండియా మధ్య డీల్ కుదిరితే టారిఫ్ లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దీనికి ఇండియా కూడా సిద్ధంగానే ఉందేమో అని ఆయన వెల్లడించారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇండియా విషయంలో తాను అసంతృప్తిగా ఉన్ననని మోదీకి తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇండియాపై 500 శాతం టారిఫ్ విధించేందుకు అమెరికా నిర్ణయించింది.