Bangladesh : ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఆందోళనకర పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఇండియాపై అక్కడివాళ్లు ద్వేషంతో రగిలిపోతున్నారు. మరోవైపు హిందువులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. హిందువుల్ని చంపడం, దాడి చేయడం, వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడం వంటి ఘటనలు బంగ్లాదేశ్ లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్తితుల్లో ఇప్పటికే ఇరు దేశాల సంబంధాలు క్షీణించినట్లు కనిపిస్తోంది.
అక్కడ ఉన్న హిందువులతోపాటు భారతీయ అధికారులకు కూడా రక్షణ లేదనే నిర్ణయానికి ఇండియా వచ్చేసింది. అందుకే వారి భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ లో ఉన్న రాయబార కార్యాలయ సిబ్బంది కుటుంబాల్ని తిరిగి ఇండియాకు వచ్చేయాలని ఆదేశించింది. బంగ్లాలోని భారత రాయబారి, ఇతర సిబ్బంది, వేరే విభాగాల్లో పని చేస్తున్న భారత సిబ్బంది కుటుంబ సభ్యుల్ని ఇండియాకు రావాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆదేశించినట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. బంగ్లాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
అయితే, ఈ నిర్ణయం సిబ్బంది కుటుంబ సభ్యులకు మాత్రమే అని.. సిబ్బంది మాత్రం అక్కడ పని చేస్తారని ఆయన తెలిపారు. భారతీయ రాయబార కార్యాలయం ఎప్పట్లాగే పని చేస్తుందని, ఇతర సేవలు కూడా కొనసాగుతాయని తెలిపారు. అయితే, ఎంతకాలంలోపు కుటుంబ సభ్యులు ఇండియా తిరిగి రావాలి అనే కాలపరిమితి విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రధాన రాయబార కార్యాలయం ఉండగా, ఛట్టోగ్రామ్, ఖుల్నా, రజ్షాహి, సిల్హెట్ లలో రాయబార కార్యాలయాలున్నాయి.