ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌పై పాక్ మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది. కశ్మీర్ తమ జీవనాడి అని, దానిని మరిచిపోలేమంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో ఓ కార్యక్రమంలో విదేశాల్లోని పాకిస్థానీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘మా వైఖరి సుస్పష్టం. కశ్మీర్ మా జీవనాడి. దానిని మరిచిపోలేం.
కశ్మీర్ సోదరులను వారి వీరోచిత పోరాటంలో మేం వదిలేయలేం’ అని వ్యాఖ్యానించారు. రెండు దేశాల విభజనను సమర్థించుకున్నారు. దీనిపై భారత్ ఘాటుగా స్పందిస్తూ విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుందని, ముందు పీవోకేను ఖాళీ చేయాలని బదులిచ్చింది.