PM Modi | టొరంటో, నవంబర్ 21 : సిక్కు వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖుల హస్తం ఉన్నదని కెనడాకు చెందిన భద్రతా సంస్థలు ఆరోపించాయని ఆ దేశ దినపత్రిక ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. కెనడాలో నివసిస్తున్న మరికొందరు వేర్పాటువాదులను కూడా నిర్మూలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు పేర్కొన్నది. ఇప్పటికే భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు అంతంత మాత్రం ఉండగా, ఈ వార్తా కథనం దానికి మరింత ఆజ్యం పోసింది. అయితే ఆ వార్తాకథనం హాస్యాస్పదం అంటూ భారత్ తోసిపుచ్చింది.
కెనడా పత్రిక కథనం ప్రకారం.. నిజ్జర్ హత్యకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కుట్ర పన్నారని, ఈ విషయాన్ని మోదీతోపాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సమాచారం ఇచ్చారని కెనడా జాతీయ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. భారత ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తుల మధ్య చర్చలు జరిగిన తరువాతనే నిజ్జర్ హత్య చోటుచేసుకున్నట్టు కెనడా భద్రతా సంస్థలు భావిస్తున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. నిజ్జర్ హత్యలో మోదీతోపాటు జైశంకర్, అజిత్ దోవల్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీకి తెలియకుండా ఓ పరాయి దేశంలో ముగ్గురు సీనియర్ రాజకీయ ప్రముఖులు హత్యకు కుట్ర చేశారనుకోవడం నమ్మశక్యం కానిదని ఆ భద్రతా అధికారి అభిప్రాయపడ్డారు. నిజ్జర్ హత్య వెనుక మాస్టర్ మైండ్ అమిత్‌షాదేనని అటు అమెరికా, ఇటు కెనడా ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చినట్టు ఆ అధికారి తెలిపారు.
కెనడాకు చెందిన బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో గత ఏడాది జూన్‌లో ఓ గురుద్వారా నుంచి వెలుపలికి వచ్చిన నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిజ్జర్తోపాటు మరో ముగ్గురు వ్యక్తుల హత్య వెనుక భారత్ పాత్ర ఉన్నట్టు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ కమిషనర్ (ఆర్సీఎంపీ) మైక్ డ్యుహీమ్ ఆరోపించారు. మరో 13 మందికి ప్రాణహాని పొంచి ఉన్నదని, వారిని మట్టుబెట్టేందుకు భారత్ చేపడుతున్న చర్యల నుంచి వారిని కాపాడటం తమ భద్రతా సంస్థల వల్ల కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై చర్చించేందుకు ఆర్సీఎంపీ బృందం అక్టోబర్ 8న ఢిల్లీ వెళ్లిందని, కానీ దౌత్యపరమైన సాంకేతిక కారణాలు చూపుతూ ఆ సమావేశం జరుగకుండా భారత్ అడ్డుకున్నదని చెప్పారు. ఆ తరువాత అక్టోబర్ 12న సింగపూర్‌లో ఆ సమావేశం జరిగిందని, కెనడాకు చెందిన విదేశాంగ శాఖ ఉప మంత్రి డేవిడ్ మారిసన్, ఆర్సీఎంపీ అధికారి మార్క్ ఫ్లిన్, భారత్ నుంచి అజిత్ దోవల్ హాజరయ్యారని తెలిపారు. ఆ సందర్భంగా తాము చూపిన అనేక సాక్ష్యాధారాలను దోవల్ తోసిపుచ్చారని వివరించారు. మూడురోజుల క్రితం బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జరిగిన జీ20 సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కెనడా ప్రధాని ట్రూడో, ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమై ఇదే అంశంపై చర్చించారని కెనడా పత్రిక పేర్కొంది. ఇదిలా ఉండగా, న్యూయార్క్‌కు చెందిన ఖలిస్థాన్ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌సింగ్ పన్నున్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నాడన్న ఆరోపణపై అమెరికా పోలీసులు వికాశ్ యాదవ్ అనే వ్యక్తిని మన్‌హట్టన్ కోర్టులో హాజరుపరిచారు. వికాశ్యాదవ్ భారత గూఢచార సంస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధికారి అని అమెరికన్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ కెనడా అధికారి చెప్పాడంటూ గ్లోబ్ అండ్ మెయిల్ పత్రిక ప్రచురించిన కథనాన్ని భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఇలాంటి హాస్యాస్పదమైన కథనాలను తోసిపుచ్చుతున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ గురువారం పేర్కొన్నారు. సాధారణంగా పత్రికా కథనాలపై తాము స్పందించబోమని, కానీ ఓ కెనడా ప్రభుత్వ అధికారి చెప్పాడంటూ ప్రచురితమైన హాస్యాస్పద కథనంపై స్పందించక తప్పడం లేదని అన్నారు. ఇప్పటికే ఉభయ దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలు ఇటువంటి కథనాల వల్ల మరింత ధ్వంసమవుతాయని పేర్కొన్నారు.