వాషింగ్టన్: పుల్వామాలో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాలు అణుయుద్ధానికి సిద్ధపడ్డాయని అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మైక్ పాంపియో పేర్కొన్నారు. ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ద అమెరికా ఐ లవ్’ పేరుతో ఆయన రాసుకున్న ఆత్మకథలో పాంపియో ఈ విషయాన్ని వెల్లడించారు. పాంపియో పుస్తకం మంగళవారం మార్కెట్లోకి విడుదలైంది.
2019 ఫిబ్రవరిలో జైష్ ఎ మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారత ఆర్మీ బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అందుకు ప్రతీకారంగా భారత్ అదేనెల 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే ఎ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడింది. ఆ తర్వాత భారత భూభాగంలోకి వచ్చిన పాకిస్థాన్ యుద్ధవిమానాన్ని తరుముతూ వెళ్లి భారత ఫ్లైట్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్‌కు చిక్కాడు.
అదే సమయంలో అమెరికా-ఉత్తరకొరియా శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఆ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మైక్పాంపియో వియత్నాంలోని హనోయ్లోగల ఓ హోటల్లో తన బృందంతో కలిసి బసచేశాడు. ఆ సందర్భంగా భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నివారించేందుకు తాను ఒక రాత్రంతా నిద్రలేకుండా గడిపానని పాంపియో తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తనకు ఫోన్ చేసి.. పాకిస్థాన్ తమపై అణుయుద్ధానికి ఏర్పాట్లు చేసుకుంటున్నదని చెప్పారని తెలిపారు.
దాంతో పరిస్థితి తీవ్రం కాకుండా ఉండేందుకు తాను, తన బృందం ఆ రాత్రంతా నిద్రపోలేదని చెప్పారు. రెండు దేశాల బాధ్యులతో చర్చలు జరిపామని అన్నారు. ఆఖరికి అప్పటి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాకు ఫోన్ చేసి సుష్వాస్వరాజ్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించగా ఆయన తోసిపుచ్చారని, తాము అణుయుద్ధానికి సిద్ధమయ్యామనడంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారని పాంపియో పేర్కొన్నారు.