న్యూఢిల్లీ, ఆగస్టు 29: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్‌పై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు గుప్పించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ కాంక్షను ప్రోత్సహిస్తున్న ఈ దేశాలు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని గ్రాహమ్ హెచ్చరించారు. పుతిన్‌ని బలపరిచినందుకు భారత్ మూల్యం చెల్లించుకుంటోందని ఎక్స్ వేదికగా ఆయన వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఉక్రెయిన్‌పై రష్యా తాజాగా జరిపిన క్షిపణుల దాడిలో 21 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడిన నేపథ్యంలో గ్రాహమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా నుంచి చవకగా చమురు కొనుగోలు చేసి పుతిన్ యుద్ధ కాంక్షను బలపరిచిన ఫలితంగా చిన్నారులతో సహా అమాయక పౌరులు మరణించడంపై భారత్, చైనా, బ్రెజిల్, తదితర దేశాలు ఎలా భావిస్తున్నాయని గ్రాహమ్ ప్రశ్నించారు. పుతిన్‌ని బలపరిచినందుకు భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. మిగిలిన దేశాలు కూడా త్వరలోనే అనుభవిస్తాయి అయన హెచ్చరించారు. పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ రాయితీ ధరలకు రష్యన్ చమురు కొనుగోలు చేసి లబ్ధి పొందుతున్న దేశాల పట్ల అమెరికాలో రగులుతున్న అసహనానికి గ్రాహం వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పవచ్చు. ఇతర దేశాలు కూడా త్వరలోనే ఫలితాన్ని అనుభవిస్తాయని పరోక్షంగా హెచ్చరించారు.