వాషింగ్టన్, ఏప్రిల్ 26: భారత్ నుంచి దిగుమతి అవుతున్న సోలార్ ఉత్పత్తులపై అమెరికా సుంకాల్ని భారీగా పెంచింది. 123 శాతం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధిస్తూ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఒక నోటీస్ జారీచేసింది. దీంతో భారత్‌కు చెందిన ముంద్రా సోలార్, కోవా, ప్రీమియర్ ఎనర్జీస్.. మొదలైన కంపెనీల దిగుమతులకు క్లిష్టిమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య ఓ వైపు చర్చలు కొనసాగుతుండగా అమెరికా ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. భారతీయ సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌పై 123 శాతం ప్రాథమిక యాంటీ-డంపింగ్ సుంకాన్ని విధించింది. దీంతో ఈ ఎగుమతులపై మొత్తం సుంకాల భారం 200 శాతం దాటింది. భారత్ సోలార్ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లోకి రాకుండా ఈ సుంకాలు అడ్డుకుంటాయని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు.