లండన్: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఆరు రోజుల యూకే, ఐర్లాండ్ పర్యటనలో భాగంగా జైశంకర్ లండన్లోని ఛాఠమ్ హౌస్లో పలు సమావేశాల్లో పాల్గొని బుధవారం రాత్రి బయటకు వచ్చారు. అప్పటికే ఆ ప్రాంగణం బయట వేచి చూస్తున్న ఖలిస్థాన్ మద్దతుదారులు భద్రతా వలయాన్ని దాటుకొని కారుకు అడ్డంగా దూసుకొచ్చారు.
కాగా, ఈ చర్యను భారత విదేశాంగ శాఖ ఖండించింది. యూకే ప్రభుత్వం వారి దౌత్య బాధ్యతలను నిర్వర్తించాలని కోరింది. ప్రజాస్వామ్య స్వేచ్ఛను ఆ శక్తులు దుర్వినియోగం చేయడం పట్ల విచారం వ్యక్తం చేసింది. ఖలిస్థాన్ మద్దతుదారుల చర్యను యూకే కూడా ఖండించింది. ఇలాంటి ఏ ప్రయత్నం అంగీకార యోగ్యం కాదని పేర్కొంది.