పారిస్: ఫ్రాన్స్‌లో అల్లర్లు(France Riots) ఆగడం లేదు. ఓ టీనేజర్‌ను పోలీసులు షూట్ చేసి చంపిన ఘటన నేపథ్యంలో పారిస్ శివారులో నిరసనకారులు భీకర విధ్వంసం సృష్టించిన విషయంతెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 667 మందిని అరెస్టు చేశారు. వరుసగా మూడవ రోజు కూడా ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. పారిస్‌లో ఉన్న అనేక షాపులపై దాడి చేశారు. కార్లను, బస్సులను కాల్చేశారు. అల్లర్లను అదుపు చేసేందుకు ప్రభుత్వం సుమారు 40వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపింది. విధ్వంసం సృష్టించడం అన్యాయమని అధ్యక్షుడు ఎమాన్యువల్ మాక్రన్ తెలిపారు.
అల్జీరియా, మొరాక్కో సంతతికి చెందిన 17 ఏళ్ల నెహల్ అనే కుర్రాడిని సోమవారం పోలీసులు షూట్ చేశారు. కారు డ్రైవింగ్ చేస్తూ వచ్చిన ఆ కుర్రాడు ట్రాఫిక్ చెక్కింగ్ సమయంలో పోలీసుల్ని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఓ పోలీసు అతన్ని షూట్ చేశాడు. కాల్పులు జరిపిన పోలీసు ఇప్పటికే ఆ కుర్రాడి ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాడు. అయితే నెహల్కు నివాళి అర్పిస్తున్న సమయంలో శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు. ఆ తర్వాత మంగళవారం నుంచి ఆందోళనలు మిన్నంటాయి. నిరసనకారులు లూటీలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. తామేమీ జాత్యాంహకార దాడికి పాల్పడలేదని పోలీసులు తెలిపారు. అల్లర్లు క్షమించరానివని ప్రధాని బోర్న్ తెలిపారు.