ఇస్లామాబాద్, మే 26: పాకిస్థాన్‌లో ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఆరు రోజుల్లోగా ప్రకటన చేయాలని ఆ దేశ ప్రభుత్వానికి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అల్టిమేటం జారీ చేశారు. ప్రావిన్సుల్లోని ప్రభుత్వాలను రద్దు చేసి సాధారణ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశం మొత్తాన్ని రాజధాని ఇస్లామాబాద్‌కు తీసుకొచ్చి నిరసన చేపడుతానని హెచ్చరించారు. గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పీటీఐ పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆజాదీ మార్చ్ పేరిట నిర్వహించ తలపెట్టిన మార్చ్‌ను సుప్రీం కోర్టు అనుమతించినా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడంపై మండిపడ్డారు. మరోవైపు, విదేశాల్లో స్థిరపడిన పాకిస్థాన్ సంతతి వారు ఓటు వేసేలా ఇటీవల కూలిపోయిన ఇమ్రాన్ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను పాక్ ప్రభుత్వం రద్దు చేస్తూ బిల్లు తీసుకొచ్చింది. దీంతో పాటు ఎన్నికల్లో ఈవీఎంలపై నిషేధం విధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు జాతీయ అసెంబ్లీ దిగువ సభ ఆమోదం తెలిపింది. బిల్లును నేడు ఎగువ సభ అయిన సెనేట్‌కు ఆమోదానికి పంపనున్నారు.