Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నెల రోజులుగా జైలు జీవితం గడుపుతున్నారు. అయితే, విషం ఇచ్చి ఆయనను హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ ఆందోళన వ్యక్తం చేసింది. జైలులో ఇమ్రాన్ పట్ల అనుమానుషంగా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. ప్రస్తుతం మాజీ ప్రధాని అడియాలా జైలులో ఉన్నారు. అయితే, ఇమ్రాన్‌కు మరింత భద్రత కల్పించాలని ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఇమ్రాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉందంటూ పిటిషన్ దాఖలు చేసిన బుష్రా బీబీ.. ఆహారంలో విషయం కలిపి చంపేందుకు అవకాశం ఉందని పేర్కొంది.
జైలు మాన్యువల్ ప్రకారం ఇమ్రాన్‌కు అవసరమైన సౌకర్యాలు సైతం లభించడం లేదని ఆరోపించారు. గతంలో పలు ఘటనలల్లో అనే మందికి ‘ఇంట్లో వండిన ఆహారం’ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చారని, అయితే తన భర్తకు ఈ సౌకర్యం లేకుండా చేస్తున్నారన్నారు. ఇమ్రాన్‌కు టీవీ, వార్త పత్రికలు, పరుపు, కుర్చీ, టేబుల్ తదితర సౌకర్యాలు కల్పించడంతో పాటు సహాయకుడిని నియమించాల్సి ఉందని.. ఇవేవి కల్పించకుండా మాజీ ప్రధాని పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే, బుష్రా బీబీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇస్లామాబాద్ కోర్టు విచారించనున్నది. అయితే, కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.