Arrest : అమెరికా (USA) లో జరిగిన రోడ్డు ప్రమాదం (Road accident) కేసులో నిందితుడిగా ఉన్న భారతీయుడు అరెస్టయ్యాడు. కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతికి అతడు కారణమయ్యాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా అగ్రరాజ్యంలోకి ప్రవేశించిన అతడి పేరు జషన్‌ప్రీత్ సింగ్ (Jashan preet Singh) అని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. 21 ఏళ్ల జషన్ సింగ్ ప్రమాద సమయంలో మాదకద్రవ్యాల మత్తులో జోగుతున్నాడని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
జషన్ సింగ్ 2022లో అమెరికాలోకి ప్రవేశించాడు. అప్పుడు కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ పెండింగ్‌లో ఉండటంతో అతడిని విడుదల చేశారు. అతడి వద్ద చట్టబద్ధమైన ప్రతాలు లేవని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజాగా ధ్రువీకరించింది. కాలిఫోర్నియా ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. సింగ్‌కు కూడా గాయాలయ్యాయి.
ట్రక్ నడుపుతున్న సమయంలో అతడు డ్రగ్స్ మత్తులో ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు. అతడు ట్రాఫిక్‌లో కూడా బ్రేక్స్ వేయలేదని ట్రక్ డ్యాష్‌క్యామ్ రికార్డింగ్‌ను బట్టి తెలుస్తోందని హైవే పెట్రోలింగ్ అధికారి వెల్లడించారు. ఇదిలాఉంటే ఈ ఏడాది ఆగస్టులోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2018లో అక్రమంగా అగ్రదేశంలోకి ప్రవేశించిన హర్జిందర్ సింగ్ ఆ ఘటనకు కారకుడని తేలింది.