USA on Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది. ఇది ఎంతో ముఖ్యమైనదని, ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొన్నది. ఈ పర్యటన ద్వారా రష్యా, ఉక్రెయిన్ సంఘర్షణకు ముగింపు పలికినట్లయితే.. అది బాగా ఉపయోకరంగా ఉంటుందని భావిస్తున్నామని అమెరికా భద్రతామండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.
శుక్రవారం ఉక్రెయిన్‌లో పర్యటించిన మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఇంకెంత మాత్రమూ సమయం వృథా చేయకుండా కూర్చుని మాట్లాడుకోవాలని.. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్లకు పిలుపునిచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా కాకుండా, శాంతివైపు ఉందని మోదీ చెప్పారు.
మోదీ-జెలెన్స్కీల మధ్య జరిగిన చర్చల గురించి విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మీడియాకు వెల్లడించారు. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతల స్థాపన జరిగేలా వినూత్న పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు రష్యా, ఉక్రెయిన్ పరస్పరం చర్చలు జరుపుకోవాల్సిన ఆవశ్యకతను జెలెన్స్కీకి మోదీ నొక్కిచెప్పారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఉక్రెయిన్ మద్దతు పలికినట్లు పేర్కొన్నారు. కాగా గత నెలలో మాస్కో వెళ్లిన మోదీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు.
యుద్ధక్షేత్రంలో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదని, చర్చలు, దౌత్యం ద్వారానే దేనికైనా పరిష్కారం లభిస్తుందని ఆయనకు తెలిపారు. ఇంకెంత మాత్రమూ సమయం వృథా చేయకుండా చర్చల దిశగా అడుగు ముందుకు వేయాలని సూచించారు.