ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ( Pakistan)లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఆదివారం ఉదయం జరిగిన పేలుళ్లలో నలుగురు మరణించగా పది మందికి గాయాలయ్యాయి. రఖ్ని మార్కెట్ ప్రాంతంలో మోటార్‌సైకిల్‌కు అమర్చిన ఐఈడీ పేలడంతో విస్ఫోటనం సంభవించిందని బర్ఖాన్ డిప్యూటీ కమిషనర్ అబ్ధుల్లా ఖోసో తెలిపారు.
గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని బర్ఖాన్ స్టేషన్ అధికారి (ఎస్హెచ్ఓ) సజ్జద్ అఫ్జల్ పేర్కొన్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసుల బృందం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. పేలుడు ప్రాంతం నుంచి రక్తపు మడుగులో ఉన్న బాధితులను వలంటీర్లు ఆస్పత్రులకు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పేలుడు ఘటనను బలూచిస్తాన్ సీఎం మిర్ అబ్ధుల్ ఖుదూస్ బిజెంజో తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు పాల్పడిన దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. అమాయక ప్రజల రక్తాన్ని కండ్లచూసిన వారు మానవత్వానికి శత్రువులని అభివర్ణించారు.
Read More :