Trump | ఇప్పటివరకు భారత్‌పై అదనపు సుంకాలతో మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దొగొచ్చారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు తొలగించేందుకు చర్చలు కొనసాగిస్తానని ప్రకటించారు. దీనిపై తొందరలోనే ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఒక పోస్టు పెట్టారు.
భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తుండటంతో అమెరికాతో వాణిజ్య సంబంధాలు బీటలు వారాయి. ఈ నేపథ్యంలోనే ఆ వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ట్రంప్ ముందుకొచ్చారు. తన ట్రూత్ సోషల్‌లో స్పందించిన ఆయన.. భారత్, అమెరికా మధ్యవ ఆణిజ్య అడ్డకుంలను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో తన స్నేహితుడు, భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు పలికేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నానని తెలిపారు.
ఇదిలా ఉంటే.. భారత్, చైనా దేశాలపై 100 శాతం టారిఫ్‌లు విధించాలని యూరోపియన్ యూనియన్ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోరినట్లు సమాచారం. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో డోనాల్డ్ ట్రంప్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్, చైనాపై 100 శాతం సుంకం విధించాలని సూచించినట్లు రాయిటర్స్ తెలిపింది. చమురు కొనుగోళ్లను ఆపేస్తామని వెల్లడించే వరకు ఆయా దేశాలపై కొత్త టారిఫ్‌లను కొనసాగించాలని సూచించారని పేర్కొంది. భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అందుకే రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావాలంటే ఈ చర్యలు అవసరమని పేర్కొన్నారు.