Sydney Hero : ఆస్ట్రేలియా (Australia) లోని సిడ్నీ నగరం (Sydney city) లో యూదులపై ఉగ్రవాదుల (Terrorists) దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ భయానక దాడి సందర్భంగా అహ్మద్ అల్ అహ్మద్ (Ahmed Al Ahmed) అనే వ్యక్తి ఉగ్రవాదులకు ఎదురొడ్డారు. తెగువను ప్రదర్శించి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. యావత్ ప్రపంచం దృష్టిలో రియల్ హీరో (Real hero) అయ్యారు.
అయితే ఆ రియల్ హీరో ఉగ్రవాదిని ఒడిసిపట్టడానికి ముందు అన్న మాటలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. ఈ ఘోరాన్ని నేను చూడలేకపోతున్నా. నేను చావబోతున్నా. జనం కోసం ప్రాణాలు ఇచ్చానని మా ఇంట్లో చెప్పండి’ అని ఆ సమయంలో తన పక్కనే ఉన్న స్నేహితుడికి చెబుతూ అహ్మద్.. ఉగ్రవాదిపైకి లంఘించాడు. అతడి చేతిలోని తుపాకీ లాక్కుని అతడికే గురిపెట్టాడు. ఉగ్రవాదితో పెనుగులాట సందర్భంగా అహ్మద్ భుజంలోకి, కాలిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి.
ప్రస్తుతం అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు మూడు సర్జరీలు చేసి బుల్లెట్లు తొలగించారు. ఇప్పుడు అతడికి ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. అహ్మద్ అల్ అహ్మద్ సిరియాకు చెందిన వ్యక్తి. నిత్యం అంతర్యుద్ధంతో నలిగిపోయే ఆ దేశాన్ని వీడి భవిష్యత్తుపై కలలుకంటూ దశాబ్దం క్రితం ఆయన ఆస్ట్రేలియాకు ఆయన వలస వచ్చారు. కుటుంబంతో కలిసి దక్షిణ సిడ్నీలోని సదర్లాండ్ షైర్లో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. స్థానికంగా పండ్ల దుకాణం పెట్టి కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ఉగ్రదాడి జరిగినప్పుడు అల్ అహ్మద్ బోండి బీచ్లో తన బంధువు జోజీ అల్కాంజ్తో కలిసి కాఫీ షాప్లో కాఫీ తాగుతున్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించగానే భయంతో బయటికి పరుగులు తీశారు. అక్కడ మారణహోమం జరుగుతుండటాన్ని చూసి అహ్మద్ చలించారు. ఇంట్లో విషయం చెప్పమని స్నేహితుడికి చెబుతూ ఉగ్రవాదిపై దాడి చేశాడు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తెగింపు ప్రదర్శించాడు. ఈ విషయాన్ని అహ్మద్ స్నేహితుడు అల్కలాంజ్ మీడియాకు వెల్లడించారు.