న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ప్రపంచంలో గడచిన 174 ఏళ్లలో ఎన్నడూ చూడని అత్యంత భీకర తుఫాన్ జమైకాపై విరుచుకుపడింది. మెలిస్సా తుఫాన్ తాకిడికి ఇప్పటివరకు ఏడుగురు మరణించగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, వరదలకు పెనువిపత్తు ఎదురుకావచ్చని జాతీయ తుఫాన్ కేంద్రం మంగళవారం హెచ్చరించింది. కరీబియన్ సముద్ర తీరం వెంబడి ఉన్న అనేక దేశాలపై మెలిస్సా విరుచుకుపడుతోంది.
జమైకాలో ముగ్గురు, హైతీలో ముగ్గురు, డొమినికన్ రిపబ్లిక్లో ఒకరు చొప్పున మరణించారు. తుఫాన్ కారణంగా సంభవించే భారీ వరదలకు ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గంటకు 175 మైళ్ల వేగంతో వీచే ప్రచండ గాలులు, 30 అంగుళాల వర్షపాతం నమోదుకావచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
గతంలో ఎప్పుడూ ఇంతటి పెను తుఫాను ఈ ప్రాంతంలో సంభవించ లేదని అధికారులు తెలిపారు. పరిస్థితి వేగంగా దిగజారిపోతోందని వారు చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ పిలుపునిచ్చారు. లోతట్టులో ఉండే కింగ్స్టన్ నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయని స్థానిక ప్రభుత్వ మంత్రి డెస్మాండ్ మెకెంజీ తెలిపారు.