రియాద్ : సౌదీ ఆరేబియాలోని సెన్డన్ ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్‌లో వందలాది భారత కార్మికులు 8 నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్నారు. తమ కనీస అవసరాలనూ కంపెనీ తీర్చడం లేదని, స్వదేశానికి వెళ్లనీయడం లేదని వారు వాపోయారు. జుబైల్‌లో ఉన్న సదరు కంపెనీ క్యాంప్-17లో తామంతా పని చేస్తున్నామని.. తమకు తిండి, నీళ్లు, వైద్య సదుపాయాలు కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
స్వదేశానికి తిప్పి పంపమని అడిగితే.. ప్రభుత్వం ద్వారా పంపుతామంటున్నారని.. అధికారుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే.. సిస్టమ్ పని చేయడం లేదని బదులిస్తున్నారని కార్మికులు తెలిపారు. అష్రఫ్ హుస్సేన్ అనే స్వతంత్ర పాత్రికేయుడు వారి కష్టాలపై ఓ వీడియోను చిత్రీకరించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వారిని ఆదుకోవాలని భారత విదేశాంగ మంత్రిని కోరారు. దీనిపై రియాద్‌లోని భారత ఎంబసీ స్పందిస్తూ.. బాధితులకు న్యాయం చేయడంలో సౌదీ అధికారుల సాయం కోరామని తెలిపింది.