బీజింగ్, ఏప్రిల్ 26 : ‘ఇనుములో ఓ హృదయం మొలిచెనే’ అంటూ రజనీకాంత్ రోబో సినిమాలో ఒక రోబో హీరోయిన్ ఐశ్యర్య రాయ్ వెంట పడ్డట్టు చైనాలోని ఒక యూనివర్సిటీలోనూ అలాంటి ఘటనే జరిగింది. నృత్య ప్రదర్శనలో పాల్గొన్న ఒక హ్యూమనాయిడ్ రోబో డాన్స్ చేస్తూ హఠాత్తుగా ఒక విద్యార్థిని దగ్గరకు వెళ్లి ఆమెను కౌగిలించుకుని అందరినీ గందరగోళంలోకి నెట్టేసింది. ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న నిర్వాహకులు ఆ అమ్మాయిని కౌగిలించుకుని ఉన్న రోబోను విడదీసి, దగ్గరుంటే ఇంకేం చేస్తుందోనని భయపడి దూరంగా తీసుకుపోయారు. చైనాలోని షన్నీక్స్ ప్రాంతంలోని ఒక యూనివర్సిటీలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇప్పుడు సామాజిక మాధ్యమంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. నిజంగా రోబోయే స్వతంత్రంగా అలా చేసిందా? లేక దానిని ఆపరేట్ చేస్తున్న వారు తప్పుగా ఆపరేట్ చేశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కృత్రిమ మేధ పరిజ్ఞానంతో తయారవుతున్న రోబోలు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించినప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెప్పింది. ఈ ఘటనలో ఆ విద్యార్థినికి ఎలాంటి గాయం కాలేదని నిర్వాహకులు తెలిపారు. జరిగిన ఘటన ప్రీ ప్రోగ్రామ్ చేసినది కాదని, ఆ సమయంలో రోబోయే తప్పు చేసినట్టు భావిస్తున్నామని చెప్పారు. ఆ తప్పు ఏఐ ప్రోగ్రామ్లో లోపమని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు స్థాపించిన సంస్థ ఈ రోబోను తయారు చేసిందని, ఈ కార్యక్రమం తర్వాత దానిని వారికి అప్పగించినట్టు తెలిపారు. సిగ్నల్ అంతరాయం వల్లే ఇది జరిగిందని నిర్వాహకులు తెలిపారన్నారు. యూనివర్సిటీలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు పలు డ్రోన్లు పనిచేస్తున్నాయని, తద్వారా సిగ్నళ్లలో అంతరాయం జరిగి ఈ ఘటన జరిగిందని షాంగ్యూ న్యూస్ వెల్లడించింది.