Turkey Earthquake: తుర్కియేలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎటుచూసినా విషాద దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. అయిన వాళ్లను కోల్పోయిన వారి ఆక్రందనలతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. శిథిలాల కింద నుంచి బయటపడుతున్న మృతదేహాలతో ఆయా ప్రదేశాలు మరుభూమిని తలపిస్తున్నాయి. ఆ ప్రదేశాల్లో కొన్ని దృశ్యాలైతే హృదయాలను ద్రవింపజేస్తున్నాయి.
పై ఫొటోలో ఉన్నది అలాంటి హృదయవిధారక దృశ్యమే. భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవన శిథాలల కింద 10 ఏళ్ల లోపు వయసున్న అక్కా తమ్ముడు ఇరుక్కున్నారు. భవనం స్లాబ్ విరిగి వాళ్లపై పడింది. అయితే అదృష్టం కొద్ది స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్ సపోర్టు కావడంతో దానికింద వాళ్లు నలిగిపోకుండా ప్రాణాలతో ఉన్నారు.
అయితే, అంతటి భయకరమైన పరిస్థితుల్లోనూ ఆ 10 ఏండ్ల బాలిక మానవత్వాన్ని చాటుకున్నది. విరిగిన స్లాబ్ ఇంకేమాత్రం జారినా ఇద్దరం ప్రాణాలు కోల్పోతామని తెలిసి కూడా తమ్ముడి తలకు తన చేతిని అడ్డుపెట్టింది. చావు కౌగిట్లోనూ ఆ బాలిక పడుతున్న తపన చూస్తే మానవత్వం శిథిలాల కింద చిక్కుకున్నదా అనిపించక మానదు. కాగా, నిద్రలో ఉండగానే స్లాబ్ విరిగి మీద పడటంతో చిన్నారులిద్దరూ పక్కలోనే ప్రాణాలు బిగబట్టుకుని రక్షించే వారి కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు.