China blast : చైనా (China) దేశంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ (Chemical Factory) లో భారీ పేలుడు (Huge blast) సంభవించింది. తూర్పు ప్రావిన్స్ షాన్డాంగ్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. మీడియా కథనం ప్రకారం.. పేలుడు సంభవించిన వెంటనే రెస్క్యూ బృందాలు (Rescue teams) రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ పేలుడుతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. అయితే ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియరాలేదు.
పేలుడు సంభవించగానే ఆ ప్రాంతంలో వందల అడుగుల ఎత్తులో దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు దాటికి ఫ్యాక్టరీకి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. మొత్తం 232 మంది అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బందితోపాటు వైద్య నిపుణులను, పలు ప్రత్యేక బృందాలను కూడా ఘటనా స్థలానికి పంపినట్లు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
వీఫాంగ్ నగరంలోని ఇండస్ట్రియల్ పార్కులో ఉన్న షాన్డాంగ్ యుడావో రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన కంపెనీలో దాదాపు 500 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.